పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కురిసిన భారీవర్షం.. తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ప్రధాన రహదారులపై చెట్లు పడిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు సైతం ఈదురుగాలులకు కుప్పకూలాయి. ఉండ్రాజవరం మండలం వడ్లూరు, చివటం గ్రామాలలో విద్యుత్ వైర్లపై చెట్లు పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చివటం గ్రామంలోని చంద్రబాబునాయుడు కాలనీలో, రేకాడ రమణకు చెందిన ఇంటిపై చెట్టు కూలటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమవడంతో పాటు ఇంట్లోని సామగ్రి పాడయ్యాయి. చెట్టు పడే సమయంలో రమణ, కుటుంబసభ్యులు అప్రమత్తం అవడం.. ప్రమాదాన్ని తప్పించింది.
ఇదీ చూడండి:వరదలతో నీటమునిగిన కాజీరంగా పార్కు