పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలోనూ అవే తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగలు రావడం తదితర లక్షణాలతో పలువురు బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు. సోమవారం 16 మంది, మంగళవారం మరో 10 మంది ఇలాంటి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 22 మంది కోలుకోగా.. ముగ్గురు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఒకరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితులెవరికీ వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశమని అధికారులు చెబుతున్నారు.
ఏలూరులో డిసెంబరు 5న వ్యాధి వెలుగులోకి వచ్చింది. మొదటి రెండు రోజుల్లోనే కేసుల సంఖ్య వందకు చేరింది. మొత్తం 615 కేసులు నమోదయ్యాయి. పూళ్ల ఆసుపత్రికి ఇప్పటివరకూ 26 మంది బాధితులు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి కొత్త బాధితులు రాలేదని వైద్యాధికారులు తెలిపారు. పూళ్లలో ఆహార కాలుష్యం వల్లే వ్యాధి వ్యాప్తి చెంది ఉంటుందని వైద్యులు, అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఎక్కువగా మాంసాహారం తినడంవల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు. సరైన కారణాలు తెలుసుకునేందుకు బాధితుల నుంచి రక్తం, మూత్రం నమూనాలు.. కూరగాయలు, నీటిని సేకరించి పరీక్షించేందుకు విజయవాడ తరలించారు. ఫలితాలు బుధవారం వస్తాయని అధికారులు చెబుతున్నారు. పూళ్ల పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధితులతో మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు.
ఇదీ చదవండీ... మధ్యాహ్నం దిల్లీకి సీఎం.. రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటీ