పేదలకు ఉచితంగా ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గందరగోళంగా మారింది. ఇళ్లస్థలాలకు ఎంపిక చేసిన లబ్ధిదారులనుంచి ఏదో రూపేణా కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు డబ్బులు వసూలు చేయటం విమర్శలకు దారితీస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామంలో 100మంది పేదల కోసం 2.60 సెంట్ల భూమిని సేకరించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం లబ్ధిదారులనుంచి రూ.1.65 లక్షలు వసూలు చేశారు. వసూలు పర్వం పూర్తయిన అయిన తర్వాత ఇళ్ల స్థలాలకోసం ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదని అధికారులు వెల్లడించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. లబ్ధిదారులలో ఒకరైన కాకర్ల నాగలక్ష్మి కుమారుడు మూర్తిరాజు ఈ వసూళ్లుపై కొవ్వూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తాను రూ.1.05 లక్షలు నగదును, రూ.60వేలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లించినట్లు మూర్తిరాజు తెలిపారు. తన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేశారని, ఏం నిర్ణయం తీసుకున్నారో తమకి ఇంకా తెలియదని బాధితుడు పేర్కొన్నాడు.