పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల నీరు వశిష్ఠ చేరటంతో ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. పట్టణంలోని స్నానాల రేవులు పూర్తిగా నీటమునిగాయి. వలంధర్ రేవు వద్ద గోదావరి ఏటిగట్టును తాకుతూ ప్రవహిస్తోంది.
గోదావరి ఏటిగట్టుకు ఆనుకుని ఉన్న పొన్నపల్లి నందమూరి కాలనీలోకి వరద నీరు చేరింది. మున్సిపల్ అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటికి తోడుతున్నారు. మండలంలోని పాత నరసాపురం గ్రామం పూర్తిగా నీట మునిగిపోగా.. మురికి కాలువలు పొంగడంతో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సరిపల్లి, చిన్నమామిడిపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలు నీటమునిగాయి. నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ ముంపునకు గురైన గ్రామాలలో పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామ ప్రజలను తరలించేందుకు బోట్లను సిద్ధం చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి