Mango Farmers Suffered a lot due to Crop Damage: వేసవి వచ్చిందంటే చాలు.. తియ్యటి మామిడిపండ్లు నోరూరిస్తుంటాయి. ఇక మొగల్తూరు బంగినపల్లి మామిడి ఒకసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. దీని టెంక చిన్నగా ఉండి.. గుజ్జు ఎక్కువగా ఉండటంతోపాటు తొక్క పలుచగా ఉండటం వల్లే ఇంతటి రుచి వచ్చిందంటారు. అందుకే దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి దేశ, విదేశాలకు బంగినపల్లి మామిడిపండ్లు ఎగుమతి అవుతుంటాయి. అంతటి ఘనచరిత్ర కలిగిన మొగల్తూరు మామిడి ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది.
మొగల్తూరు, నరసాపురం మండలాల పరిధిలోని మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కేపీపాలెం, తూర్పుతాళ్లు, సారవ, సీతారామపురం గ్రామాల్లో విస్తరించి ఉన్న సుమారు 3వేల ఎకరాల్లో మామిడిపంటకు తెగుళ్లు ఆశించి పంట పూర్తిగా నష్టపోయింది. పూత రాలిపోవడం, పిందెరాలడంతో పాటు.. కాయపై మచ్చలు ఏర్పడి తినడానికి పనికిరాకుండా పోతున్నాయి.
సాధారణంగా మొగల్తూరు మామిడి నూజివీడు ప్రాంతంతో పోలిస్తే సీజన్ చివరిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడూ జనవరిలో పూతకు వచ్చే చెట్లు ఈసారి డిసెంబర్‌లోనే పూతపూయడంతో రైతులు ఎంతో ఆనందపడ్డారు. అయితే వారి ఆశలో ఎంతో కాలం నిలవలేదు. అకాల వర్షాలు, మంచు, పురుగు, తెగుళ్లు వారి ఆనందాన్ని ఆవిరి చేశాయి. ఈసారి పూత ఎక్కువరావడంతో పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి వ్యాపారులు తోటలు లీజుకు తీసుకున్నారు. అయితే మంచుకారణంగా పూత మొత్తం రాలిపోయింది. కొద్దోగొప్పో మిగిలిన పిందెలు కాస్తా.. అకాల వర్షాలకు పూర్తిగా రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మొగల్తూరు, నరసాపురం మండలాల్లో వేల ఎకరాల్లో మామిడి విస్తరించి ఉన్నా.. ఇక్కడ ఉద్యానవనశాఖ సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండటం లేదు. రైతులే తెగుళ్లు సోకిన ప్రతిసారీ అవగాహన లేకుండానే సొంతంగా మందులు వాడుతూ నష్టపోతున్నారు. అకాల వర్షాలతో పాటు తేనెమంచు, తెగుళ్లు, పండు ఈగతో మామిడి పంట పూర్తిగా దెబ్బితింటోంది. పెద్ద పెద్ద కాయలు సైతం తెగుళ్లు సోకి.. పగుళ్లు ఏర్పడి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.
చెట్టు నిండా కాయలున్నా.. ప్రతి కాయకి మంగు, నక్షత్రాకారంలో మచ్చలు, పగుళ్లు కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి ఎగుమతుల మాటే మరిచిపోయామని.. కనీసం స్థానిక మార్కెట్ లో కాయలు అమ్ముకుందామన్నా తెగుళ్లు పూర్తిగా దెబ్బతీశాయని మామిడి వ్యాపారులు వాపోతున్నారు.
కరోనా ముందు వరకు మొగల్తూరు మామిడి ఒడిశా, రాంచీ, బిహార్, బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. సీజన్లో సగటున రోజుకు వందల టన్నుల్లో ఎగుమతులు ఉండగా.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొన్నేళ్లుగా అసలు ఎగుమతి అనే మాటే ఇక్కడ వినిపించడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అటు రైతులు, ఇటు వ్యాపారులు వేడుకుంటున్నారు.
"మేము ప్రతి సంవత్సరం మామిడి తోటలను తీసుకొని.. సొంతంగా అమ్ముకొని వ్యాపారం చేసేవాళ్లం. ఈ సంవత్సరం కూడా రెండు ఎకరాలను లక్ష రూపాయలకు కొన్నాను. మందులు కొట్టడానికి పెట్టుబడి 30 నుంచి 40 వేల రూపాయలు అయింది. పూత సమయంలో కొంత పోయింది. ప్రస్తుతం వర్షాల వలన కొంత పోయింది. పెట్టుబడి కూడా వచ్చే విధంగా కనిపించడం లేదు". - మద్దాలి నాగబాబు, వ్యాపారి- నరసాపురం
ఇవీ చదవండి: