పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షానికి పంటలు నీటమునిగాయి. గురువారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుండగా.. సుమారు 6,680 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 416 హెక్టార్లలో మొక్కజొన్న కోత దశలో ఉండగా దీనిలో 223 హెక్టార్లలో పంట నేలకొరిగింది.
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
జిల్లాలో ప్రధానంగా అరటి 440 హెక్టార్లు, నిమ్మ 12 హెక్టార్లు, కూరగాయలు 8 హెక్టార్లలో, పొగాకు, జొన్న తదితర పంటలు రెండు హెక్టార్లలో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. త్వరలో జిల్లాలో పర్యటించి పంట నష్టంపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తామని చెప్పారు.
1,400 ఎకరాల్లో తడిసిన మొక్కజొన్న
దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో మొక్కజొన్న పంట తడిసింది. పలు చోట్ల తీగలపై చెట్లు పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ సిబ్బంది శ్రమించి సరఫరాను పునరుద్దరించారు. పెదపాడు - ఏలూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో అడ్డుగా పడిన చెట్లను పెదపాడు సొసైటీ అధ్యక్షుడు అక్కినేని రాజశేఖర్ యంత్రాల సాయంతో తొలగించారు.
పొంగిన డ్రెయిన్లు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని వీధుల్లో డ్రెయిన్లు పొంగి పొర్లాయి. రాజులకాలనీలో చెట్టుకొమ్మ విద్యుత్తు స్తంభాలపై విరిగిపడింది. హోర్డింగులు ఎగిరిపడ్డాయి. విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. నరసాపురం మండలంలోని యర్రంశెట్టిపాలెం, లక్ష్మణేశ్వరం, సారవ తదితర గ్రామాల్లో కోసిన వరి వర్షం పాలైంది. పనలు తడిసి ధాన్యం రాలిపోయింది.
దెబ్బతిన్న అరటి
నిడదవోలు నియోజకవర్గ పరిధిలో అరటి పంట పూర్తిగా నేలవాలింది. ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టామని.. కోతకు వచ్చిన గెలలు తోటలోనే ఉన్నాయని రైతులు వాపోతున్నారు. కంసాలి పాలెంలో 50 నుంచి 60 ఎకరాల వరకు అరటి పంటకు నష్టం వాటిల్లింది. వరి పంట కూడా అక్కడక్కడ నేలవాలింది. పాలంగి తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది.
పొగాకు పంటకు నష్టం
కొయ్యలగూడెం మండలంలో దాదాపు 450 ఎకరాల్లో వర్జీనియా పొగాకు పంట దెబ్బతింది. మండలంలో 154 హెక్టార్లలో మొక్కజొన్న, 10 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. మంగపతిదేవిపేటలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి.
టి.నరసాపురం మండలంలోని టి.నరసాపురం, బొర్రంపాలెం, తెడ్లెం, మక్కినవారిగూడెం, అల్లంచర్లరాజుపాలెం గ్రామాల్లో 31 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల రాలింది. రాజుపోతేపల్లి, మక్కినవారిగూడెం, టి.నరసాపురం గ్రామాల్లో సుమారు 20 ఎకరాల్లో అరటి పంట విరిగి పడింది.
తాడేపల్లిగూడెం మండలంలో కొన్ని గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంట పడిపోయింది. 12 ఎకరాల్లో మొక్కజొన్న, 11 ఎకరాల్లో వరి పంట నేలకొరిగినట్లు మండల వ్యవసాయాధికారి ఆర్‌ఎస్ ప్రసాద్ తెలిపారు.
ఏలూరులో నీటమునిగిన రైతుబజారు
ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రైతుబజారు నీట మునిగింది. నీరు నిలిచి ఉండటంతో గురువారం ఉదయం గేటు బయట విక్రయాలు సాగించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు పొంగిపొర్లాయి.
ఇదీ చూడండి: