మెట్ట ప్రాంత దు:ఖదాయినిగా పేరుపొందిన ఎర్రకాలువ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ, ముద్దాపురం, కోనాల, ఉండ్రాజవరం పసలపూడి, సూర్యారావుపాలెం, అత్తిలి మండలం వరిఘేడు, బల్లిపాడు తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో వరిపంట నీటి పాలైంది. మూడు పర్యాయాలు పంట వివిధ దశల్లో నీట మునగటంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎర్రకాలువ జలాశయం నుంచి సుమారు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా.. వాటికి తోడు పులివాగు, బైనేరు వాగుల నుంచి వరద నీరు భారీ ఎత్తున చేరుతోంది. నందమూరు, దువ్వ ఆక్విడెక్టుల వద్ద ప్రవాహం ఉద్ధృతి మరింత పెరుగుతోంది. ఫలితంగా కాలువ వెంబడి ఉన్న గ్రామాల్లో పంటచేలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎర్రకాలువ పరిధిలోనే అయిదు నుంచి ఆరు వేల ఎకరాల పంట నష్టం ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎర్రకాలువ జలాశయం నుంచి కిందికి విడుదల చేసే నీటి ప్రమాణం తగ్గితే నందమూరు, దువ్వ ఆక్విడెక్టుల వద్ద వరద ఉద్ధృతి తగ్గే అవకాశముందని అధికారులు అంటున్నారు.
ఇవీ చూడండి...