పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్యెల్యే, తెదేపా నాయకుడు బడేటి కోటారామారావు అలియాస్ బడేటి బుజ్జి గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన్ని ఏలూరులోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. బడేటి బుజ్జి ఏలూరు అసెంబ్లీ తెదేపా బాధ్యులుగా పని చేశారు. 2014 నుంచి 2019వరకు ఆయన ఏలూరు శాసన సభ్యుడిగా పనిచేశారు. గతంలో ఏలూరు పురపాలక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా నుంచి ఎమ్యెల్యే అభ్యర్థిగా పోటీచేసి.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రముఖ నటుడు ఎస్వీరంగారావుకు ఆయన స్వయానా మేనల్లుడు. బడేటి కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తెదేపాలో క్రీయశీలకంగా వ్యవహరించిన బుజ్జి మరణం తీరని లోటని పలువురు నేతలు ఆవేదన చెందారు. బడేటి బుజ్జికి భార్య రేణుక కూతురు లక్ష్మీహాస్, కొడుకు చంద్రహాస్ ఉన్నారు. ఏలూరు నగరం నుంచి భారీగా తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి.. మృతదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పిస్తున్నారు.
ఇదీ చూడండి: