ఏలూరు పార్లమెంట్... అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తోన్న సీటు. ఈ విషయంలో తెలుగుదేశం, వైకాపా ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఆర్థిక బలంతోపాటు... సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకొని గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఒక్కో పార్టీలో ఇద్దరు... ముగ్గురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తుండటం ఏలూరు ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మాగుంటా..రాజీవా..?
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంట్ విషయంలో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాల్‌గా మారింది. అధికార పార్టీతోపాటు...ప్రతిపక్షం ఒకే దారిలో వెళ్తున్నాయి. కిందటిసారి తెదేపా అభ్యర్థిగా మాగుంట బాబు విజయం సాధించారు. మరోసారి తన అభ్యర్థిత్వంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మనసులోని మాటను తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్లారు. పార్టీ బలోపేతానికి చేసిన కృషి... విభజన హామీల అమలుకు చేసిన పోరాటంతో ఆయనకు మంచిమార్కులే ఉన్నాయి. మాగుంట వైపే అధిష్ఠానం మొగ్గుతున్నా...మరో నేత బోళ్లరాజీవ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే అనుభవం లేదన్న కారణంతో పక్కన పెట్టారు. ఈసారి మాత్రం ఏలూరు స్థానం కోసం గట్టిగానే ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్థికబలం ఉన్నా... అనుభవ లేమి, ప్రజలకు చేరువకాకపోవడం, పార్టీ వ్యవహారాల్లో చురగ్గా లేకపోవడం రాజీవ్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి.
తెరపైకి కావూరి..?
అధికార పార్టీలోని సందిగ్దతే... ప్రతిపక్షంలోనూ కనిపిస్తోంది. ఏలూరు సీటు విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నారు జగన్. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ వైకాపా సమన్వయకర్తగా మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ ఉన్నారు. భాజపాలో ఉన్న ఆయనే రెండేళ్ల కిందటే వైకాపాలో చేరారు. ఏలూరు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తారని దాదాపు ఖరారైనా... వారం రోజులుగా మరో పేరు వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం భాజపా నేత కావూరి సాంబశివరావు పేరు తెరపైకి వస్తోంది. ఈ సీటు కోసం కావూరి గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.