online Kodipandelu : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే కోడిపందేలు ఆన్‌లైన్‌కెక్కాయి. కొన్ని నెలలుగా కోళ్లను పెంచేవారు వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి ఖరీదైన కోళ్ల జాతులు, వాటి వివరాలు, డింకీ పందేలలో కోళ్లు కొట్టుకునే వీడియోలతో పెద్దఎత్తున వ్యాపారాలు చేశారు. ఖరీదైన కోళ్లను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన కొందరు వీటిని ఇలా వాట్సప్ గ్రూపుల ద్వారా అమ్ముతున్నారు. కోడి రంగు, రకాన్ని బట్టి రూ.50 వేల నుంచి లక్ష వరకు అమ్ముడవుతోంది. బొబ్బిలి కోళ్లకు ఆన్‌లైన్‌లో మంచి గిరాకీ ఉందని తెలుస్తోంది. దీంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల్లోని కొందరి వాట్సప్ గ్రూపులలో పశ్చిమగోదావరి వాసులను చేర్చి, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. రెబల్‌కాక్ ఫైట్స్ పేరుతో కొన్ని వాట్సప్ గ్రూపులు జిల్లాలో రెండు నెలల ముందు నుంచే హల్‌చల్ చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉంటూ పండుగకు కోడి పందేలకు వచ్చే వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీటిని ఆన్‌లైన్ ద్వారా కొంటున్నారు. కోళ్ల అమ్మకాలకు ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా ఏర్పాటయ్యాయి.
విదేశాల నుంచి శిక్షణ
కోళ్లకు శిక్షణను ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారు. మలేషియా లాంటి దేశాల్లో ఉన్న కొందరు నిపుణులు ఈ కోళ్లను ఎలా సిద్ధం చేయాలో నేర్పుతున్నారు. ఉదయాన్నే చల్లటి నీటిప్రవాహ ఉద్ధృతిలో విడిచి, వాటికి ఎదురీదడం నేర్పుతున్నారు. దీనివల్ల పందెంలో కోడికి ఆయాసం రాదు. జిల్లాలోని దువ్వ, జల్లికాకినాడ, వేండ్ర తదితర గ్రామాల్లో ఇలాంటి శిక్షణ పొందిన కోళ్లు ఉన్నాయని పెంపకందారులు చెబుతున్నారు.
విజేత కోడి హల్‌చల్
సుదూరప్రాంతాల్లో ఉన్నవారూ జిల్లాలో జరిగే కోడిపందేలు చూసేందుకు వీలుగా భీమవరం, పోడూరు, దెందులూరు తదితర ప్రాంతాల్లో కొన్నిచోట్ల కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్‌లో ప్రదర్శిస్తున్నారు. జూదరులు ల్యాప్‌టాప్‌లో కోళ్ల కొట్లాటలు చూస్తూ అక్కడి నుంచే బెట్టింగ్ వేస్తున్నట్లు సమాచారం. జనవరి నెల ప్రారంభం నుంచే పశ్చిమగోదావరి యువత సెల్‌ఫోన్లలో వాల్‌పేపర్లు, థీమ్స్, వాట్సప్ స్టేటస్‌లు, ఇన్‌స్టా రీల్స్‌లో ఇప్పటికే నమూనా పందేలను ఉంచారు. బరులకు ఎలా రావాలో చూపేందుకు గూగుల్ మ్యాప్స్ లింకులూ ఇస్తున్నారు.
* పోడూరు ప్రాంతానికి చెందిన సురేష్‌రాజు వద్ద ఉన్న కోడి డింకీ పందేలలో గెలిచింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ఆ కోడి పేరు టైసన్. దానికి ఎన్నో లైక్‌లు వచ్చాయి. ఇటీవల ఒక వ్యక్తి పోడూరు మండలం వేడంగిలో తాను కోళ్లను ఎలా పెంచుతున్నారో యూట్యూబ్‌లో పెట్టారు. దీన్ని 10 లక్షల మందికి పైగా చూశారు.
లక్ష పలికే చింతలపూడి పందెంకోళ్లు
చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో నాగు అనే వ్యక్తి తన పామాయిల్ తోటలో దాదాపు 200 పందెం కోడిపుంజులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటికి చిన్నప్పటి నుంచి ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు ఆహారంగా ఇస్తారు. బలానికి బీకాంప్లెక్స్, కాల్షియం సిరప్‌లు ఇస్తారు. 15 నెలల వయసులో ఈత నేర్పుతారు. 18 నెలలు దాటాక రోజూ డ్రై ఫ్రూట్స్ లడ్డూ, వేటమాంసం కైమా, ఆకుకూరలు, చిరుధాన్యాలు పెడతారు. పండక్కి రెండు నెలల ముందు నుంచీ రోజూ వేణ్నీళ్ల స్నానం చేయిస్తారు. ఉదయం వాకింగ్, సాయంత్రం ఫైటింగ్ నేర్పుతారు. 20 నెలల తర్వాత పందేలకు బరిలోకి దింపుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వచ్చి వీటిని కొంటారు. రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వీటి ధర పలుకుతుంది. ఏటా రూ. 20 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది.
ఇదీ చదవండి