తెదేపానేత అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను నిన్న కలపర్రు టోల్‌గేటు వద్ద ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చింతమనేని, ఆయన అనుచరులను పోలీసులు గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చింతమనేని ప్రభాకర్ రాత్రంతా ఏలూరు గ్రామీణ పోలీస్టేషన్లో ఉంచారు. ఆయనపై అంటువ్యాధుల చట్టం ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి కేసులు నమోదు చేశారు. రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి.. ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందుకు చింతమనేని అనుమతించలేదు. ఎట్టకేలకు అర్ధరాత్రి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆయనతో పాటు.. అరెస్టు అయిన తెదేపా నాయకులు, కార్యాకర్తలకు కోవిడ్ పరీక్షలు చేశారు. అర్ధరాత్రి సమయంలో జడ్జి ముందు హాజరుపరిచేందుకు వీలుకాకపోవడంతో ఆయనను స్టేషన్లోనే ఉంచారు. చింతమనేని స్టేషన్లోనే నిద్రపోయారు. ఆయనతో పాటు.. తెదేపా కార్యకర్తలు అక్కడే ఉండిపోయారు. పోలీసుల అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ చింతమనేని అర్ధరాత్రి ధర్నా చేపట్టారు.
ఇదీ చదవండి: జగన్‌ను కంట్రోల్ చేసేది చంద్రబాబే: జేసీ దివాకర్ రెడ్డి