రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై తక్షణమే నష్టం అంచనాలు రూపొందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్ను కోరారు. రాష్ట్రంలో వర్ష బీభత్సం వల్ల తలెత్తిన 11 సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 3 పేజీల లేఖ రాశారు.
"ఓవైపు కరోనా కష్టాలు, ఇంకోవైపు విపత్తు నష్టాలు రాష్ట్ర ప్రజానీకాన్ని అతలాకుతలం చేశాయి. ఏడాదిన్నరగా వరుస విపత్తులతో నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకున్న చర్యలు శూన్యం. ఇన్పుట్స్ ధరలు పెరిగి రైతుల పెట్టుబడులు అధికమయ్యాయి. యూరియా బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నా స్పందన లేదు. దళారుల రాజ్యంగా రాష్ట్రం మారింది. ఇకనైనా ప్రభుత్వం ముందుకొచ్చి రైతు వ్యతిరేక చర్యలకు స్వస్తిచెప్పాలి. ఆదుకునే చర్యలతో అన్నదాతల్లో మనోధైర్యం పెంచాలి" అని హితవు పలికారు.
విధ్వంసం తగదు
"మరో 4రోజులు భారీ వర్ష హెచ్చరికలున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయాలి. ప్రతి జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి. 1100 కాల్ సెంటర్ను నిర్వీర్యం చేయకుండా ఉంటే ఎంతో సహాయకారిగా ఉండేది. వ్యవస్థల నిర్మాణంలో పోటీపడాలి తప్ప విధ్వంసం తగదు. ఇప్పటికైనా కాల్ సెంటర్ సేవలు పునరుద్ధరించి బాధితులకు సాయం చేసేలా చొరవ చూపాలి. తక్షణమే విపత్తు నిర్వహణ శాఖతో పాటుగా రెవెన్యూ, జలవనరులు, విద్యుత్, తదితర శాఖల ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. సహాయ పునరావాస చర్యల్లో అందరినీ నిమగ్నం చేయాలి. ప్రభుత్వ పనితీరు ద్వారా బాధిత ప్రజానీకంలో భరోసా నింపాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు
అనేక రంగాలకు తీవ్ర నష్టం
"ఈ స్థాయిలో వర్ష బీభత్సం గత దశాబ్దంలో చూడలేదు. చేపలవేటకు వెళ్లిన వారీ ఆచూకీ లేక మత్స్యకార కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో నీట మునగటంతో రైతాంగం పూర్తిగా డీలాపడింది. పంట, ఆస్తి, ప్రాణనష్టంతో పాటు లక్షలాది పేద కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయారు. అనేకచోట్ల రహదార్లకు కోత పడింది, వంతెనలు కొట్టుకుపోయాయి. చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీటమునిగాయి. మగ్గం గుంతల్లో నీరు చేరి చేనేత కార్మికులు, వేటకు పోలేక మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. గీతకార్మికులు, ఇతర చేతివృత్తుల వారి కష్టాలు అనేకం. ప్రభుత్వ ఆపన్న హస్తం కోసం బాధిత కుటుంబాలన్నీ ఎదురు చూస్తున్నాయి." అని చంద్రబాబు వివరించారు.
తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలు..
- మృతుల కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవాలి
- దెబ్బతిన్న పంటల నష్టం అంచనా యుద్దప్రాతిపదికన చేపట్టాలి.
- తడిసి రంగుమారి దెబ్బతిన్న పంట ఉత్పత్తులను, కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలి.
- ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలి
- ఉపాధి కోల్పోయిన చేనేత, ఇతర చేతివృత్తుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాలి.
- దెబ్బతిన్న వలలు, పడవల కొనుగోళ్లకు ఆర్ధిక సాయం అందించాలి.
- దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్ధిక సాయం అందించాలి.
- కూలిపోయిన, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్తఇళ్లు మంజూరు చేయాలి.
- వాగులు, వంకలకు పడ్డ గండ్లు పూడ్చటంతో పాటు రహదారులకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయాలి
- తక్షణమే సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలి
ఇదీ చదవండి: నీటిపాలైన పొలాలు.. లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం