Outer Ring Road in Amaravathi: ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకునేందుకు ఏ నగరానికైనా బాహ్య వలయ రహదారి ముఖ్యం. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్‌ఆర్ ఎంతో కీలకం కానుంది. ఔటర్ రింగురోడ్డు పూర్తయితే సీఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఓఆర్‌ఆర్‌తో అన్ని రంగాలు అభివృద్ధి చెంది అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రగతికి బాటలు పడనున్నాయి. బహు ప్రయోజనాలున్న అమరావతి ఓఆర్‌ఆర్ రాష్ట్రానికే గేమ్ ఛేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అన్ని ఖర్చులూ కేంద్రమే: వైఎస్సార్సీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కార్ పెద్ద యజ్ఞమే చేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం అమరావతి బాహ్యవలయ రహదారి ప్రాజెక్టుపైనా ప్రత్యేక దృష్టి సారించింది. 189.4 కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సహా అన్ని ఖర్చులూ కేంద్రమే భరించనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ-మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఓఆర్‌ఆర్‌కు దగ్గర ఉన్నందున తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని అభిప్రాయపడింది. ఓఆర్‌ఆర్‌లో నాలుగుచోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది.
భవిష్యత్తులో 8 వరుసల విస్తరణ: డిసెంబర్ 20న మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. 150 మీటర్ల వెడల్పుతో ఓఆర్‌ఆర్ కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని కమిటీ తేల్చింది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకూ వీలుంటుందని తెలిపింది. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్ వెంబడి రైల్వేలైన్ నిర్మాణం, తదితరాలకు భూమి అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ జాతీయ రహదారుల చట్టం-1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున, ఆ భూమిని అందుకోసమే వినియోగించాల్సి ఉంటుంది.
కావాలంటే ప్రభుత్వం రైల్వేశాఖతో సంప్రదించి అదనపు భూసేకరణ చేయొచ్చని సూచించింది. 189 కిలోమీటర్ల రింగురోడ్డులో తూర్పు భాగంలో 78 కిలోమీటర్లు, పశ్చిమ భాగంలో 111 కిలోమీటర్లు మేర నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 11 ప్యాకేజీలుగా విభజించి మూడు దశల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది.
భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు చేయండి - లక్ష్మీమిత్తల్‌ను కోరిన నారా లోకేశ్
మెగా సిటీగా మారనున్న కొన్ని నగరాలు: ఓఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్‌ఆర్‌కు వెలుపల, సమీపంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరిగి ప్రత్యేక డెవలప్‌మెంట్ నోడ్స్‌గా వృద్ధి చెందుతాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాలకు ఓఆర్‌ఆర్ ద్వారా పోర్టులకు వెళ్లడం సులభమవుతుంది. బాపట్ల జిల్లాలోని తీరప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆక్వా రంగానికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచి రింగురోడ్డుకు అనుసంధానం ఏర్పడితే అభివృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఓఆర్‌ఆర్ సీఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధికి కీలకం కానుందని నిపుణులు చెబుతున్నారు. రింగు రోడ్డుకు రూ.16 వేల 310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరాలకు సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఖర్చు రూ.1156 కోట్ల మేర తగ్గింది. ప్రాజెక్టుకయ్యే మిగతా రూ.15 వేల కోట్లు కేంద్రమే వెచ్చించనుంది. అమరావతి ఓఆర్‌ఆర్ వీలైనంత త్వరగా పూర్తయితే రాష్ట్రానికే మణిహారంలా మారుతుందని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
దావోస్లో రెండో రోజు సీఎం చంద్రబాబు - వరుస సమావేశాలతో బిజీబిజీ
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : పైసా పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి రుణాలు