KISHAN REDDY: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను సోమవారం నుంచి వచ్చే సంవత్సరం జులై 4వ తేదీ వరకూ ఏడాది పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దిల్లీ, విశాఖపట్నం, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తామని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భీమవరం సభలో ఆయన ప్రసంగించారు. ‘ఈ ఏడాదంతా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో అల్లూరి పేరు మార్మోగాలి. ఆయన కుటుంబీకుల్ని, ఆయనతో కలిసి పనిచేసిన గిరిజన సైన్యంలోని ముఖ్యులైన గంటం దొర, మల్లు దొర, వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాల్, శంకోజీ ముక్కడు, బొంకుల మోదిగాడు, భీమవరానికి చెందిన వేగిరాజు సత్యనారాయణ (అగ్గిరాజు) తదితరుల కుటుంబీకుల్ని కలుస్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘స్వతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది త్యాగాలు, పోరాటాల్ని నవతరానికి తెలియజేస్తున్నాం. అందులో భాగంగా తెలుగు నేలపై పుట్టిన, తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మీరు భీమవరం రావాలని ప్రధానిని కోరిన వెంటనే ఆయన సమ్మతించారు’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
అల్లూరి పేరు మార్మోగుతుంది: నానిరాజు
‘స్వతంత్ర పోరాటంలో గెరిల్లా యుద్ధం చేసిన ఏకైక వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి వాడీ వేడిని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చవి చూపించి వారి వెన్నులో వణుకు పుట్టించాడు’ అని అల్లూరి జయంత్యుత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నానిరాజు అన్నారు. ‘ఆయన సాహసాలు గురించి చెబుతుంటే ఉప్పొంగని నరం.. స్పందించని స్వరం ఉండదు. ఆయన పేరుతో ప్రత్యేక జిల్లా ప్రకటించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 125వ జయంత్యుత్సవాలకు ముందే శ్రీకారం చుట్టారు. ఆ మహనీయుడి 30 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్రమోదీ భీమవరం రావడం మా సుకృతం. ఇప్పటివరకూ ఒక ప్రాంతానికే పరిమితమైపోయిన అల్లూరి సీతారామరాజు పేరు దేశమంతా మార్మోగుతుంది’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: