పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివ.. బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. తను అందంగా లేనని.. అందుకే పెళ్లి కావడం లేదని ఆత్మన్యూనతాభావానికి గురయ్యేవాడు. కన్నతల్లి నచ్చజెప్పినా వినేవాడు కాదు. ఎలాగైనా అందంగా మారాలనుకున్నాడు. శస్త్రచికిత్స చేయించుకుని.. రూపు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే.. శివ పాలిట శాపమైంది. ఆయన భవిష్యత్తును అంధకారంలో పడేసింది.
అందంగా మారడం కోసం శస్త్ర చికిత్సకు సిద్ధమైన శివ.. బైక్ మెకానిక్‌గా కొంత మొత్తాన్ని పోగేశాడు. భీమవరంలోని న్యూలండన్ ఆసుపత్రి వైద్యుడు సుంకర అనిల్‌ను కలిశాడు. తొలుత ముఖానికి పై ఓ వైపే ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యుడు... 3 నెలల తర్వాత మరోవైపు సర్జరీ చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కారణమేంటో ఎవరికీ అర్థం కాలేదు. కొన్నాళ్లకు శివ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. చివరికి మతిస్థిమితం కోల్పోయాడు.
తన కొడుకు పరిస్థితిని వివరించేందుకు వెళ్తే.. ఏమీ పరవాలేదు.. తగ్గిపోతుంది.. అన్న సమాధానం వచ్చిందని బాధిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్ని రోజులైనా శివ తీరు మారని పరిస్థితుల్లో.. మళ్లీ వైద్యుడిని సంప్రదిస్తే.. మానసికనిపుణులను సంప్రదించాలన్న సలహా ఆమెను అయోమయంలో పడేసింది. సర్జరీ తర్వాతే ఇలా ఎందుకు జరిగింది అని.. చికిత్స చేసిన వారిని ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదన్న ధోరణిలో మాట్లాడుతున్నారని శివ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. శివ ప్రవర్తన కారణంగా.. ఇంటి యజమాని తమను ఖాళీ చేయాలని పట్టుబడుతున్నాడని.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతోంది.
తన కుమారుడి పరిస్థితిపై.. భీమవరం పోలీసులకు శివ తల్లి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని భీమవరం వన్ టౌన్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. తల్లితో పాటు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన శివ.. అక్కడ ఉన్న బైక్ చూసి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఇన్నాళ్లూ బైక్ మెకానిక్‌గా పనిచేసిన శివ.. అలా బైక్ ఎక్కగానే.. అక్కడున్నవాళ్ల కళ్లు చెమర్చాయి.
ఇవి చదవండి...వైద్యుని వికృత చేష్టలు.. చితకబాదిన మహిళ!