వైకాపాకు వ్యతిరేకంగా పనిచేసినందుకు తమ కుటుంబంపై ఆ పార్టీ వర్గీయులు దాడి చేశారని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాధితులు వాపోయారు. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు.. ఉంగుటూరు మండలం కాకర్లమూడికి చెందిన దారం వెంకటేశ్వరరావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అతని ఆటోను తెదేపా మద్దతుదారుల ప్రచారం కోసం పెట్టారు. మంగళవారం రాత్రి గ్రామంలో మహంకాళమ్మ ఉత్సవాలు జరుగుతుండగా సుమారు 15 మంది కలిసి వెంకటేశ్వరరావు కుటుంబంపై కర్రలతో దాడిచేశారు.
ఈ దాడిలో వెంకటేశ్వరరావు, అతని కుమార్తె మార్తారత్నంతోపాటు ఆపడానికి ప్రయత్నించిన వారి బంధువులు మద్దాల పండు, దారం మరియమ్మ, మద్దాల మహంకాళి, దారం కాంతారత్నంలపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై చేబ్రోలు ఎస్సై వీర్రాజు మాట్లాడుతూ అది మద్యం మత్తులో జరిగిన గొడవని, దీనికి రాజకీయ కక్షలు కారణం కాదన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: జగన్ కేసు తేల్చే బాధ్యత నా మీద వేసుకున్నా: రఘురామకృష్ణరాజు