కేంద్రం ఆమోదించిన సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 47,726 కోట్ల రూపాయలతో ముందుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రాజెక్టులోని స్పిల్ వే నిర్మాణం, స్పిల్ ఛానల్, పైలట్ చానల్ కాంక్రీటు పనులు, కాఫర్ డ్యామ్లు, ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం 5 వేల కోట్లు, భూసేకరణ, పునరావాసం, పరిహారం కోసం 27 వేల కోట్ల మేర తొలిదశలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త అంచనా వ్యయం అమోదంతో డీపీఆర్-2లో 7,823 కోట్ల రూపాయల మేర కోత పడింది. ఆ మొత్తం భర్తీకి సంబంధించి తదుపరి ఎలా వ్యవహరించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కొత్త డీపీఆర్ ఆంగీకారంతో భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించినట్లయింది. ఇప్పటివరకు భూసేకరణ, పునరావాస వ్యయం భరించే అంశంపై స్పష్టత లేక.. దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జనలు పడింది. అయితే గతంలో రూపొందించిన డీపీఆర్-2 ప్రకారం 55,545 కోట్లను కోరినప్పటికీ ఆ అంచనాలను కుదిస్తూ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భూసేకరణ, పునరావాసం, కుడి, ఎడమ కాల్వల వ్యయంలో ఈ మొత్తాన్ని తగ్గించారు. ప్రస్తుతం డీపీఆర్-2కి కేంద్రం అంగీకారం తెలియచేసినందున.. 2021 జూన్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇవీ చదవండి.. నిర్ణీత తేదీల్లో వాల్తేరు డివిజన్లోని పలు రైళ్లు రద్దు