విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆర్టీసీ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే అలజంగి జోగారావు నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేశారు. దేశానికి వెన్నుముక రైతు అని..., రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుందని..., సీఎం జగన్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
అనంతరం చీపురుపల్లిలో గులివింద అగ్రహారంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఎంపీ చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల వైకాపా నాయకులు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
రాష్ట్ర, దేశ రాజకీయల్లో తన దైన ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని... మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం పట్టణంలోని వైఎస్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా... వారి ఆశయాలను, ఆలోచనలను అమలు చేసేందుకు ఆయన తనయుడు సీఎం జగన్ మనకున్నారని అన్నారు.
బాగాపురంలో దివంగత నేత వైఎస్ఆర్ ఆయన ఆశయాలను తీర్చేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేసేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న సేవలు కొనియాడదగినవి అని తెలిపారు.
కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కోమరాడ, గరుగుబిల్లి మండలాల్లోని ఆదర్శ రైతులకు ఉప ముఖ్యమంత్రి సన్మానం చేసారు.