YCP faction fight: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం లక్కవరపుకోటలో చేపట్టారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే.. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల ఎంపిక చేసిన సచివాలయ కన్వీనర్లను శాసనసభ్యుడు తమకు నచ్చినవారిని నియమించారని. కనీస సమాచారం లేదని ఎమ్మెల్సీ వర్గీయులు మంత్రి బొత్స ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
సభలో శాసనసభ్యుడు మాట్లాడుతున్న సమయంలోనూ ఆయన ప్రసంగానికి అడ్డు పడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మంత్రి బొత్స చొరవ తీసుకొని ఇరువర్గాల వారికి సర్ది చెప్పారు. సమావేశం ముగిసిన తరువాత కూర్చొని మాట్లాడుకుందామని ఎమ్మెల్సీ వర్గీయులను సముదాయించటంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ.. జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా ఎస్.కోట నియోజకవర్గం ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని.. పార్టీ పెద్దలు సమస్యను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: