ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నామని... పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలన్నారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరం మాతా శిశు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఆసుపత్రుల్లో సేవలందించిన కార్మికులకు ప్రభుత్వం ఇస్తానన్న నెలకు రూ.1000 సహాయం తక్షణమే చెల్లించాలన్నారు. రూ.16 వేల కనీస వేతనానికి సంబంధించి జీవోను అమలు చేయాలని కోరారు. కార్మికులను ఒప్పంద విధానంలో కాకుండా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పని భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో విజయనగరంలోని మహారాజా, ఘోషా ప్రభుత్వ వైద్యశాలలతో పాటు నెల్లిమర్ల, గజపతినగరం, పార్వతీపురం సామాజిక ఆరోగ్య కేంద్రాల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: