Volunteers Suicide Attempt Incident: ‘మా ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎలా గుర్తిస్తావు? మాకు గిట్టనివారికి లబ్ధి ఎలా చేకూర్చుతావు? ఏదైనా మాకు చెప్పే చేయాలి’ అని వార్డు కౌన్సిలర్, ఆమె భర్త వేధిస్తున్నారంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీకి చెందిన వాలంటీరు గొల్లపల్లి విజయలక్ష్మి బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితురాలు తెలిపిన వివరాలివి. ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించే సమయంలో వైసీపీ కౌన్సిలర్ అనసూయమ్మ, ఆమె భర్త రాజగోపాలనాయుడు వేధిస్తున్నారని బాధితురాలు తెలిపారు. అర్హుడైన జాగాన శశికాంత్ కోసం వాహనమిత్ర దరఖాస్తు పెట్టానని.. ఆయనకు ఎందుకని రాజగోపాలనాయుడు ఫోన్ చేసి ప్రశ్నించారన్నారు. అతనికి నచ్చినట్లు పనిచేయడం లేదని, తనను విధుల నుంచి తొలగించాలని సచివాలయ అడ్మిన్ రామారావుకు ఫిర్యాదు చేశారని వాపోయారు.
దీంతో వేధింపులు భరించలేకే బుధవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డానని బాధితురాలు చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబీకులు బొబ్బిలి సామాజిక ఆసుపత్రికి తరలించారు. కౌన్సిలర్‌కు చెప్పాకే వార్డులో ఏ పనైనా చేయాలని అధికారులు చెబుతున్నా విజయలక్ష్మి పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ భర్త రాజగోపాలనాయుడు తెలిపారు. సమస్యలుంటే చెప్పాలని, అంతేకానీ ఇలా బెదిరించడం సరికాదని పేర్కొన్నారు.
పరామర్శించిన టీడీపీ నేత: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాలంటీర్ విజయలక్ష్మిని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన పరామర్శించారు. ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని బాధితురాలికి భరోసా ఇచ్చారు. కారకులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక మరో ఘటన.. అనంతపురం జిల్లాలో మరో వాలంటీర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన జరిగింది. స్థానిక వడ్డె కాలనీకి చెందిన వెంకటేశులు (వెంకి) అనే గ్రామ వాలంటీరు పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి సెల్ఫీ వీడియో సామాజిక మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. వెంకటేశులు వాలంటీరుగా పనిచేస్తూనే పాడి పోషణతో జీవనం సాగిస్తున్నాడు.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థలో తన రెండు సెంట్ల స్థలంపై రుణం అడిగితే స్నేహితుడి దుకాణం ముందు ఫొటోలు తీసుకుని సుమారు రూ.6 లక్షలు రుణానికిగాను రూ.5.72,00 లక్షలు ఇచ్చారు. కొంత కాలంగా కంతులు కట్టాడు. వాయిదాల రూపంలో కట్టిన వివరాలు ఇమ్మని అడుగగా ఐటీ రిటర్న్స్ పెట్టి బిజినెస్ మీద రూ.6 లక్షల రుణం ఇచ్చామని, వడ్డీతో కలిపితే రెట్టింపైందని సిబ్బంది తెలిపారు. కొన్ని నెలలుగా రుణం చెల్లించాలని తనను, తల్లిని వేధిస్తుండటంతో పురుగు మందు తాగినట్లు వాలంటీరు తెలిపాడు. గమనించిన కుటుంబీకులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.