స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. అందుకే ఒక్కరిని కూడా వదలడానికి అభ్యర్థులు ఇష్టపడటం లేదు. ఉపాధి కోసం, ఉద్యోగ రీత్యా, ఇతర కారణాలతో వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని వెతికి పట్టుకొని మరీ, వచ్చి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. అమ్మ, మరిది, మామ, చెల్లెమ్మా.. అంటూ ఏ గ్రామ పంచాయతీలో చూసినా ఇప్పుడు ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి.
వలస ఓటర్లే కీలకం:
జిల్లాలోని బొబ్బిలి, మెంటాడ, సీతానగరం, బలిజిపేట, మక్కువ, బాడంగి, తెర్లాం తదితర మండలాల నుంచి సుమారు 50 వేల మంది వలస వెళ్లిన వారుంటారు. హైదరాబాద్, విశాఖ వంటి ప్రధాన పట్టణాల్లో ఉంటున్న వారే ఎక్కువ. ప్రతి గ్రామంలో 100 మంది ఓటర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఓట్లే కొన్ని పంచాయతీల్లో అభ్యర్థుల భవిష్యత్తు నిర్ణయించనున్నాయి. రాజమహేంద్రవరం, రావులపాలెం, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి చిరునామాలు కూడా సేకరిస్తున్నారు. అక్కడకు వెళ్లి మాట్లాడుతున్నారు. చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల వారితో ఫోన్లలో సంప్రదించి ప్రయాణ ఖర్చులకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దూరం ఆధారంగా రవాణా ఛార్జీలు ఇస్తున్నారు. అదీ కూడా కేవలం రావడానికే. డబ్బులన్నీ ఒకేసారి ఇస్తే తర్వాత రాకపోవచ్చనే అనుమానంతో ఇలా జాగ్రత్త పడుతున్నారు. పోలింగ్ తేదీన వచ్చే వారికి గ్రామాల్లో భోజనాలు, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.
ఎవరికి వేస్తారో..
చాలాచోట్ల బరిలో ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉన్నారు. వారి గెలుపును అంచనా వేయడం కష్టమే. వీరంతా వలస ఓటర్లకు డబ్బులు పంపిస్తున్నారు. వారిలో ఓటు ఎవరికీ వేస్తారో అంతుచిక్కడం లేదు. బలిజిపేట మండలానికి చెందిన ఓ వలస ఓటరు మాట్లాడుతూ అందరి నుంచి డబ్బులు తీసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతుందని, వద్దంటే ఓటు ఆయనకు వేయలేదని తెలిసిపోతుందన్నారు. ఓటేయలేదని తెలిస్తే మేం వలస వెళ్లిపోయాక ఇంటి వద్ద ఉండే మా తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బందులు పెట్టవచ్చన్నారు. ఈ భయంతో చాలామంది అభ్యర్థులందరి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటున్నారు.
సీతప్ప: చిన్నమ్మే.. నేను మీ సీతప్పను.. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తవేంటి?
చిన్నమ్మి: సీతప్ఫ. నువ్వెప్పుడు నాకు ఫోన్ చేసినావు.. ఇప్పుడు గుర్తొచ్చానా.. ఏటి సంగతి?
సీతప్ప: మీ బావ చిన్నయ్య పంచాయతీ ఎలచ్చన్లలో పోటీ చేత్తండు. మీ ఓట్లు మన ఊళ్లో ఉన్నాయి గదా. ఒకసారి నువ్వు, మా మరిది వచ్చి ఓటేసి వెళ్లండి.
చిన్నమ్మి: ఇప్పుడెలా వత్తాం... బోల్డు పని..
సీతప్ప: అలా అంటావేటి.. ఎలా అయినా నువ్వు, మరిది వచ్చి తీరాలే, మీ కోసం బండి పంపుతా.. ఖర్చులకు డబ్బులు ఏస్తా.
వాహనాలు, రిజర్వేషన్లు:
గ్రామానికి చెందిన నాలుగైదు కుటుంబాలు ఒకేచోట ఉంటే వాహనాలు పెట్టుకుని రావాలని సూచిస్తున్నారు. వాహనం సమకూర్చి రావడానికి ఓ వ్యక్తిని అక్కడికి పంపిస్తున్నారు. బస్సు, రైలుకు వస్తామంటే టిక్కెట్లు రిజర్వేషన్ చేసి ఇచ్చి వస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన అభ్యర్థులు ఇప్పటికే కొందరికి ప్రయాణ ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి:
పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న ఏపీ...