విజయనగర పార్లమెంటు చరిత్ర..
విజయనగరం లోక్సభ నియోజకవర్గం2009లో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల, రాజాం శ్రీకాకుళం జిల్లాలో ఉండగా బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం ఇక్కడే ఉన్నాయి. తొలిసారి కాంగ్రెస్ తరపున బొత్స ఝాన్సీ 60 వేల 571 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో బొత్స ఝాన్సీపై తెదేపా అభ్యర్థి అశోక్ గజపతిరాజు లక్షా 6వేల 911 ఓట్లతో పసుపు జెండా ఎగరేశారు. ఈసారి గజపతిరాజుతో వైకాపా నుంచి బెల్లాన చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు.
రాజుగారి రాజకీయ ప్రస్థానం..
1978లో రాజకీయ ప్రవేశం చేసిన అశోక్ గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం తరపున 1978, 1983, 1985, 1989, 1994, 1999 వరకూ ఏకధాటిగా ప్రతీ ఎన్నికలోను గెలుపొందారు. 2004లో మాత్రం స్వతంత్ర అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. 2009లో మరోసారి కోలగట్లతో తలపడి గెలుపొందారు.2014లో విజయనగరం ఎంపీగా పోటీ బంపర్ మెజార్టీతో జయకేతనం ఏగరేశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగానూసేవలందించారు. మళ్లీ విజయం కోసం తహతహలాడుతున్నారు.
పసుపుదళం బలాబలాలు..
తెదేపా అభ్యర్థి అశోకగజపతిరాజు రాజకీయ అనుభవజ్ఞుడు. పార్లమెంటు నిధుల వినియోగంలో ఆదర్శంగా నిలిచారు. 26.95కోట్ల రూపాయలతో గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్య రంగాలతోపాటు సహజ ఇంధన వనరుల వినియోగ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. గజపతినగరం, నెల్లిమర్ల, ఎచ్చర్ల, బొబ్బిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ పోటీలో నిలిచారు. విజయనగరం అసెంబ్లీకి గజపతి కుమార్తె అదితి,చీపురుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున, రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళి బరిలోకి ఉన్నారు. బొబ్బిలిలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు భారీ మెజార్టీ తీసుకొస్తారని తెలుగుదేశం ఆశిస్తోంది. నెల్లిమర్లలో పతివాడ నారాయణస్వామినాయుడు ఏడు సార్లు గెలిచి., ఎనిమిదో విజయానికి ఉవ్విళ్లూరుతున్నారు. చీపురుపల్లి, గజపతినగరంలో తెదేపా నేతల మధ్య అసంతృప్తి కొంత లోపంగా కనిపిస్తోంది.
ఉద్దండుడితో చంద్రశేఖరుడు ఢీ
గజపతిరాజుపై వైకాపా నుంచి పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్ కొత్త అభ్యర్థి. ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కానీ 40ఏళ్ల రాజకీయ ఉద్దండుడిని ఢీకొట్టేందుకు సై అంటున్నారు. బొత్స సత్యనారాయణకు ఉన్న అనుభవం చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరంలో గట్టి ప్రభావం చూపుతుందని వైకాపా ధీమా వ్యక్తం చేస్తోంది. విజయనగరం అసెంబ్లీ స్థానంలో దీర్ఘకాలంగా కోలగట్ల వీరభద్ర స్వామికి పట్టు ఉంది. ఎచ్చర్లలో తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి స్థానికేతరుడు కావటం తమకు లాభిస్తుందని వైకాపా శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి సారిగా ఎంపీ బరిలో దిగుతున్నప్పటికీ గెలుపు ఖాయమని బెల్లాన చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా..రాజకీయాల్లో తలపండిన అశోక్ గజపతిరాజును ఓడించడం అషామాషీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.