విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో కూరగాయల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రాలకు ఎగుమతి నిలిచిపోవడం వల్ల అవస్థలు పడుతున్నారు. కొనుగోలు చేసే వారు లేకపోవడం... కనీస మద్దతు ధర లేకపోవటంతో ఆందోళనకు గురవుతున్నారు. గతంలో రూ.10 నుంచి 15 వరకు కూరగాయల ధరలు పలికేవి. ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనుగోలు చేయకపోవటంతో దిక్కుతోచని స్థితిలో రైతులు సతమతమవుతున్నారు. కూలి డబ్బులు రాకపోటంతో కొంతమంది రైతులు పొలాల్లోనే కూరగాయలను వదిలేస్తున్నారు.
ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద మార్కెట్‌గా రామభద్రపురానికి పేరుంది. ఇక్కడి నుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. లాక్‌డౌన్‌తో రవాణా నిలిచిపోవటంతో కొనుగోలు చేసే వారు లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చవిచూడ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగా, బెండ, చిక్కుడు వంటి పంటలను రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కళ్లెదుటే పంట కొనుగోలు చేసే వారు లేకపోవటంతో రైతులు కంట తడిపెడుతున్నారు. ప్రభుత్వమే కూరగాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.