విజయనగరంజిల్లాలో అతిపెద్ద కూరగాయల మర్కెట్ రామభద్రపురం. రామభద్రపురం మండలంతో పాటు., బొబ్బిలి, బాడంగి, సాలూరు, పాచిపెంట మండలాల రైతుల కూరగాయలు, ఆకుకూరల విక్రయాలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ కొనుగోలు చేసిన సరకు... జిల్లాలోని ఇతర మార్కెట్ లకే కాకుండా.. విశాఖ, అనకాపల్లి మార్కెట్ లతో పాటుగా., ఒడిశా, చత్తీష్ గడ్ రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంది. నిత్యం ఇక్కడ లక్షలాది రూపాయల లావాదేవీలు జరుగుతాయి.
అయితే., రామభద్రపురం కూరగాయల మార్కెట్లో రైతులకు కరోనా పరిస్థితులను, నిబంధనలను బూచిగా చూపి దళారులు తమకు నచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం కష్టంగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు సక్రమంగా నడవడం లేదని మభ్య పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితులను దళారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.. కరోనా మాటున తక్కువ ధరకు కూరగాయలు కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయిస్తున్నారు.
మార్కెట్లో గతంలో ధరల పట్టిక ఏర్పాటు చేశారు. ఏ రోజు ఎంత ధర ఉందో అందులో రాసేవారు. మార్కెటింగ్ శాఖ అధికారులు రోజూ ఈ ధరలపై సమీక్ష నిర్వహించే వారు. అంతకంటే తక్కువకు కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు ఉండేవి. కరోనా నెపంతో ఐదు నెలలుగా ధరలు రాయడం లేదు. దీన్ని ఆసరా చేసుకుని దళారులే ధర నిర్ణయిస్తున్నారు. ఈ పరిస్థితులను ఆసరగా చేసుకుని దళారులు., రైతులను దోచుకుంటున్నారు. దళారుల దందాతో., కూరగాయల సాగు ఖర్చులు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.
అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనా దళారులు రవాణా, ఇతర ప్రాంతాల్లో మార్కెట్ ఇబ్బందులను బూచిగా చూపుతున్నారు. కూరగాయల గిరాకీ పెరిగినప్పటికీ మార్కెట్ లో దోపిడికి తెరదీశారు. వీరిని నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన తగిన చర్యలు తీసుకొని., కొనుగోలుదార్ల దోపిడికి మూకుతాడు వేయాలని కూరగాయల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: కాలం చెల్లిన సరకు అమ్మకాలపై ఎక్సైజ్‌శాఖ నిర్వాకం