విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లు నాగమణి, హరిత, పల్లవి కత్తిసాములో ప్రతిభ కనబరుస్తున్నారు. నాగమణికి చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి ఎక్కువ. చేతితో కర్రను అవలీలగా తిప్పగల నైపుణ్యం తన సొంతం. పాఠశాలలో అవకాశం దొరికినపుడ్లలా తన నైపుణ్యం ప్రదర్శించేంది. కళాశాలలో ఆమె ప్రతిభ గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఫెన్సింగ్ క్రీడలో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించి ఆ దిశగా శిక్షణలో చేర్చారు. అనతి కాలంలోనే జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడాకారిణిగా ఎదిగింది నాగమణి.
జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో రాణించిన నాగమణి.. రాష్ట్రస్థాయిలోకి అడుగుపెట్టింది. 2016 లో కాంస్యం, 2017లో రజతం సాధించింది. అప్పటి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఎన్నో పతకాలు సాధిస్తూ వస్తున్న నాగమణి.. 2018 లో మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.
అక్కబాటలోనే
అక్కబాటలోనే చెల్లెళ్లు హరిత, పల్లవి సైతం జాతీయస్థాయి ఫెన్సింగ్ క్రీడాకారిణులుగా గుర్తింపు సంపాదించారు. అండర్ 19 విభాగంలో హరిత రాణిస్తుండగా.. అండర్ 14 విభాగంలో పల్లవి దూసుకుపోతోంది. ముగ్గురూ తమ చదువులు కొనసాగిస్తూనే కత్తి సాములో విజయాలు సాధిస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
నాగమణి, హరిత, పల్లవిల తండ్రి ఆటో డ్రైవర్. పేద కుటుంబమే అయినా తమ ముగ్గురు పిల్లల ఆసక్తి మేరకు క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు. స్థానికంగా మెరుగైన సౌకర్యాలు, ఆర్థిక ప్రోత్సాహం ఉంటే తమ కుమార్తెలు ఫెన్సింగ్ క్రీడలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విజయనగరం అక్కా చెల్లెల్లు కత్తి సాములో తమ ప్రతిభకు పదును పెట్టే దిశగా ముందుకు సాగుతున్నారు. ముగ్గురూ గుడివాడ ఫెన్సింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. జాతీయస్థాయిలో పతకాల పంట పండించి...అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఇదీ చూడండి..
వివాదం: తితిదే వెబ్సైట్లో సప్తగిరి ఏప్రిల్ ఎడిషన్ తొలగింపు