Teachers Demand Govt To Cancel GPS : జీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద జీపీఎస్ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. సీఎం జగన్‌కు ఓటేసి తప్పు చేశామని పేర్కొన్నారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగినబుద్ధి చెబుతామని వెల్లడించారు.
ఓపీఎస్ విధానం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఉంటుందని.. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి అనడం దారుణమని యుటిఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు వృద్ధాప్యంలో ఆసరగా ఉండేందుకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, దాని స్థానంలో జీపీఎస్‌ను అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 60 శాతం సొమ్మును ప్రభుత్వం దోచేసే ఉద్దేశంతో జీపీఎస్ తీసుకొచ్చిందని తెలిపారు. జీపీఎస్ విధానానికి ఎటువంటి నిర్దిష్టమైన వివిధ విధానాలను రూపొందించలేదని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ కు తప్పకుండా రిటన్ గిఫ్ట్ ఇస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. కొంతమంది అమ్ముడు పోయిన ఉద్యోగ సంఘాల నాయకులతో జీపీఎస్‌కు అనుకులంగా మాట్లాడిస్తున్నారని తెలిపారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు కోసం నాలుగున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోకుండా జీపీఎస్ ను అమోదించడం దారుణమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జీపీఎస్ బిల్లును ఆమోదించి, వారి ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసిందని జీపీఎస్ ఆమోదించిన బిల్లు ప్రతులను యుటిఎఫ్ నాయకులు దగ్ధం చేశారు.
Minister Botsa Satyanarayana on GPS: జీపీఎస్ అందరికీ ఆమోదయోగ్యమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు: మంత్రి బొత్స
యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ జీపీఎస్ వద్దని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పోరాటాలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. అసెంబ్లీలో ఏకపక్షంగా జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారెంటీ లేని పెన్షన్, పెన్షన్ స్కీము గ్యారెంటీ పెన్షన్ అని పేరు పెట్టడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయటమేనని ఆక్షేపించారు. ఏ రాష్ట్రంలో లేని కొత్త విధానం, దేశానికి ఆదర్శం అని ప్రభుత్వం చెబుతుందన్నారు. కంట్రిబ్యూషన్ కట్టించుకొనే విధానం ఆదర్శమెలా అవుతుందని ప్రశ్నించారు. భవిష్యత్ లో జీపీఎస్ చట్టం రద్దు, పాత పెన్షన్ సాధించడం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని అందుకు తగిన కార్యచరణ త్వరలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలు తెలియజేశారు