రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెదేపా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు అన్నారు. రామతీర్థంలో ఎంతో గొప్ప చరిత్ర ఉన్న రాముడు విగ్రహ ధ్వంసం చేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్ద బొండపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఒకవైపు రాజకీయ హత్యలు మరోవైపు దేవాలయాలపై దాడుల మధ్య ఏ సామాజిక వర్గం ధైర్యంగా ఉండే పరిస్థితులు కనిపించటం లేదని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా ప్రశాంతతకు పెట్టింది పేరని, అటువంటి చోట రాముడు విగ్రహం ధ్వంసమైన ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. గత కొన్నాళ్లుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే దాడి చేసిన వారిని వెనకేసుకు వచ్చే విధంగా యంత్రాంగం తీరు ఉందని విమర్శించారు.
దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తీర్మానం చేసిన నేటికీ అమలు కాలేదని ఎమ్మెల్సీ అన్నారు. రామతీర్థం పక్కనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ జరిగిందని... దేవాలయంపై దాడి గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పవిత్రతను కాపాడతానని ముఖ్యమంత్రి ఊరట నిచ్చే మాట చెప్పి ఉంటే బాగుండేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :