Foreign Birds Flock to Coringa Sanctuary in Kakinada District : పచ్చని ప్రకృతి అందాలకు, గలగల పారే నీటి సవ్వడులకు పక్షుల కిలకిల రావాలు మరింత రమణీయతను అద్దుతాయి. రంగు రంగుల రెక్కలోతో వాటి విహంగం చూపరులకు ఎంతో వినోదాన్నందిస్తాయి. ఇటువంటి ఆహ్లాదకరమైన దృష్యాలే మన మడ అడవిలో చూడొచ్చు. విదేశీ పక్షులతో కలకలలాడే ఆ అభయారణ్యం మన కాకినాడలోనే ఉందని మీకు తెలుసా!
కోరంగి అభయారణ్యం కాకినాడ జిల్లాకు ఓ కంఠాభరణం వంటిది. నగలలో వజ్రాలు, వైఢూర్యాలు మెరిసినట్లు ఈ మడ అడవి ఒడిలో దేశవిదేశీ పక్షులు ఆకట్టుకుంటాయి. ఇక్కడకు వచ్చే సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. ఆహారాన్వేషణ, సంతానోత్పత్తి కోసం ఏటా వచ్చినట్లే ఈసారి కూడా పెద్ద ఎత్తున పక్షులు ఇక్కడికి వచ్చాయి. వాటి సంఖ్య లెక్కించేందుకు ఆదివారం తెల్లవారుజామున వన్యప్రాణి విభాగ అధికారులు, సిబ్బంది పడవలపై బయలుదేరారు. పొగ మంచులో వెళ్తూ గుంపులు గుంపులుగా విహరిస్తున్న విహంగాలను కెమెరాలో బంధించి ముచ్చటపడ్డారు.
అరుదైన అందాలు - పక్షి ప్రేమికులకు పండగే
ప్రకృతిలోని పక్షుల సంరక్షణే మానవాళి తమ బాధ్యగా తీసుకోవాలి. తాళ్లరేవు మండలం కోరంగి జీవ వైవిధ్య కేంద్రంలో వలస పక్షులకు కోరంగి అభయారణ్యం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సముద్రతీరం, నదీ ముఖం వాటికి తగిన ఆహారాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. వలస పక్షులు ఇక్కడే సంతానోత్పత్తి కూడా చేస్తాయని గతంలో పలువురు అధికారులు తెలిపారు.