Chandrababu Fires on CM Jagan: సీఎం జగన్ అసమర్థత, అవినీతి వల్ల.. రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్రీకృత అవినీతి పెచ్చరిల్లిపోయిందన్న చంద్రబాబు.. ఆ అవినీతి సామ్రాజ్యానికి రారాజు జగన్ అని ఆరోపించారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. ధరల పెరుగుదలకు ప్రభుత్వ అవినీతే కారణమన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే.. వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం.. మళ్లీ ఛార్జీలు పెంచేందుకు యత్నించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజలపై మోయలేని భారాలు మోపిన వైసీపీ ప్రభుత్వం ..వాటిని ప్రశ్నించిన వారిని కేసులతో వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"జగన్ బటన్ నొక్కుడు కాదు బటన్ బొక్కుడు. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచాడు. మీ రక్తాన్ని తాగే ముఖ్యమంత్రి అవసరమా మనకు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటి పన్ను పెరిగిందా లేదా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయా లేదా. బటన్లు నొక్కడం వలన ప్రయోజనం లేదు. జగన్ ది పేదల ప్రభుత్వం కాదు.. పేదలను దోచే ప్రభుత్వం, ఈ విషయాన్ని ఆడబిడ్డలు ఆలోచించాలి. సాక్షి గుమస్తా సజ్జల నీకు రాజకీయం తెలుసా. నాకు నువ్వు ఉపన్యాసాలు ఇస్తావా.. తోక కట్చేస్తా జాగ్రత్తగా ఉండండి"-చంద్రబాబు, టీడీపీ అధినేత
అమరావతిలో ఉంటున్న ఇంటికి తాను బాడుగ కడుతుంటే.. అర్థం పర్థం లేకుండా నోటీసులు పంపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. బెదిరిస్తే భయపడడానికి తాను సామాన్యుడిని కాదన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తానని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్.. ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేలా కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు. ఒకే ప్రాంతంలో వెయ్యి ఎకరాలు సేకరించి మనిషికి సెంటు ఇస్తానని అంటున్నారని మండిపడ్డారు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటారన్న చంద్రబాబు.. కనీసం మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే 40 వేల కోట్ల భూదోపిడి.. 10 వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. సిమెంటు మాఫియా తో 12 వేల కోట్లు , సెంటు పట్టా పేరుతో 7వేల కోట్లు , రేషన్ బియ్యం రీసైకిలింగ్‌తో 7 వేల కోట్లు, ఎర్రచందనం మాఫియాతో మరో 7 వేల కోట్లు కొట్టేశారన్నారు. లేపాక్షి హబ్ కింద కోట్లాది రూపాయలు తాడేపల్లికి చేరాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక దోపిడీ సొమ్ము కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
టీడీపీ కార్యకర్త రాజయ్య కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శ: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వాహన శ్రేణిపై జరిగిన రాళ్ల దాడిలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజయ్య కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. పార్టీ తరఫున రాజయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని... అధైర్యపడొద్దని రాజయ్య కుటుంబానికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాజయ్య మృతదేహానికి శవపరీక్ష నిర్వహించే విషయంలో పోలీసులు, తెలుగుదేశం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పంచనామా రిపోర్టు పూర్తి కాకుండా శవపరీక్ష నిర్వహించడాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో మంత్రి సురేష్ పేరు కూడా చెర్చాలని టీడీపీ నేత ఎరిక్షన్ బాబు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: