విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని భీమాళి గ్రామంలో ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన వృత్తి. క్రమంగా ఔత్సాహికులు... మామిడి తోటల పెంపకం చేపట్టి తాండ్ర తయారిపై దృష్టి సారించారు. ఇది లాభాదాయకంగా ఉన్నందున మరికొంత మంది మొగ్గుచూపారు. ఇలా... భీమాళిలో 400 సంవత్సరాలుగా మామిడి తాండ్ర తయారీ ఆనవాయితీగా కొనసాగుతోంది.
తయారీ విధానం ఇలా..!
మామిడి గుజ్జుకు పంచదార కలిపి ఈ తాండ్రాను తయారు చేస్తారు. ఒక చాపకు పొరలుగా సమారు 60నుంచి 70కిలోలు వచ్చేలా ఈ మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతలో ఆరబోస్తారు. కలెక్టరు, కోలంగోవా రకాల మామిడిపండ్లను తాండ్ర తయారీకి అధికంగా వినియోగిస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం మామిడి గుజ్జు, పంచదార మాత్రమే వినియోగించటం భీమాళి తాండ్రలో ప్రత్యేకత. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు... పక్కనున్న ఒడిశాకు దీనిని సరఫరా చేస్తున్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా.... తరతరాలుగా వస్తున్న ఉపాధిని కొనసాగిస్తున్నామంటున్నారు భీమాళీ వాసులు.
తీపి మాటున చేదు
భీమాళి తాండ్ర... చుట్టు ప్రక్కల 10 గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. రుచిలో ప్రత్యేకతను చాటుతోన్న ఈ తాండ్ర... తయారీదారులకు మాత్రం నష్టాలు తెస్తోంది. మార్కెట్ సదుపాయం, తాండ్రను నిల్వ చేసుకోవడానకి శీతలీకరణ కేంద్రం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరంలో ఉన్న శీతలీకరణ కేంద్రంలోకి సుమారు 3వేల రూపాయలు చెల్లించి నిల్వ చేసుకుంటున్నారు.
గతేడాది టన్ను మామిడి ధర 7వేల నుంచి 9వేలకు లభ్యమయ్యేది. ఈ ఏడాది ఇది అమాంతంగా 12వేల రూపాయలకు పెరిగింది. పంచదార ధరకూ రెక్కలు వచ్చినందున పెట్టుబడులు అధికమయ్యాయని తయారీదారులు వాపోతున్నారు. ప్రభుత్వం తగిన మౌళిక వసతులు కల్పించి ఆర్థిక సాయమందిస్తే... తరతరాల తాండ్ర తయారీ పరిశ్రమ మరింత అభివృద్ధి దిశగా సాగే అవకాశం ఉంది.