జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో విజయనగరం జిల్లాకు ఉన్న ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకుంది. కేవలం ఒక్క నెలలోనే కోటి పనిదినాలను కల్పించి రికార్డు సృష్టించింది. సగటు వేతనం విషయంలో కూడా విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకంటే ముందుంది. జిల్లాలో ఒకేరోజు 6లక్షల, 40వేల, 894 మంది వేతన దారులు ఉపాధి హామీ పనులకు హాజరు అయి రికార్డు సృష్టించారు. వీరిలో కొత్త వారు సుమారు లక్షా, 7వేల, 51 మంది ఉండటం విశేషం. ఇప్పటి వరకు రూ.454.88 కోట్లు ను వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం కోటి 86 లక్షల 88 వేల పనిదినాలను కల్పించగా ఒక్క జూన్ లోనే కోటి 3 లక్షల పనిదినాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్ధానం సాధించింది.
కరోనా లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని, ఈ నెలలో కోటి పనిదినాలను కల్పించాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదేశాలను నిజం చేస్తూ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో డ్వామా యంత్రాంగమంతా కలిసికట్టుగా కృషి చేసి ఈ ఘనతను సాధించింది. జిల్లాలో ఉపాధి వేతన దారుడికి సగటు వేతనం రోజుకు రూ.243 అందడం విశేషం. అరుదైన గుర్తింపు సాధించిన విజయనగరం జిల్లా డ్వామా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఉన్నతాధికారులనుంచి ప్రశంసలు దక్కాయి.