ఈ నెల 27న నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు కొవిడ్ నిబందనలతో నిర్వహించాలని అధికారురను విజయనగరం డీఆర్వో ఎం. గణపతి రావు ఆదేశించారు. పాలిసెట్ పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద థర్మల్ స్ర్కీనింగ్ ఏర్పాట్లు, శానిటేషన్, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడాలని ఆదేశించారు. జ్వరం ఉన్నా, కరోనా సోకిన అభ్యర్ధులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలన్నారు.
రెండు గంటల ముందే రావాలి..
జిల్లాలో మొత్తం 6887 మంది అభ్యర్ధులు... 29 కేంద్రాల్లో ఉదయం 11గంటల నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్ధులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని ఆయన సూచించారు. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా సంబంధిత తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జిల్లా మేనేజర్ ఎన్. బాపి రాజు, అదనపు వైద్యాధికారి డా. రవి కుమార్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీస్, రెవిన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి సీఎంలు జగన్, యడియూరప్ప భూమిపూజ