ఉత్తరాంధ్రలోనే పేరుపొందిన మాన్సాస్ ట్రస్టు విషయంలో వరుస వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ - మాన్సాస్ ట్రస్టును 1958లో పీవీజీ రాజు స్థాపించారు. విద్యను ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా పలు విద్యా సంస్థలు నిర్వహిస్తూ వచ్చారు. 108 ఆలయాలు, 14వేల 800 ఎకరాల విలువైన భూములు కలిగి ఉన్న మాన్సాస్ ట్రస్టుకు 1994లో పీ.వీ.జీ. రాజు మరణం తర్వాత ఆయన పెద్ద కుమారుడు ఆనంద్ గజపతి రాజు ఛైర్మన్ అయ్యారు. 2016లో ఆనంద్ గజపతి రాజు మరణం తర్వాత రెండో కుమారుడు అశోక్ గజపతి రాజు...పదవి చేపట్టారు. అయితే... వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను తొలగించి ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచైత గజపతి రాజును ఆ పదవిలో నియమించింది. ఈ చర్య ట్రస్టు వీలునామా నిబంధనలకు విరుద్ధమన్న అశోక్ గజపతి ఆరోపణలతో వివాదం రేగింది.
ట్రస్టు ఛైర్మన్ హోదాలో సంచైత గజపతి రాజు తాజాగా తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి తెరలేపింది. 1879లో స్థాపించిన చారిత్రక మహారాజ కళాశాలను ప్రైవేటీకరించాలని ఆమె సంకల్పించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మాన్సాస్ ట్రస్టు పాలకవర్గం నిర్ణయాన్ని అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. మద్రాస్ కళాశాల తర్వాత రాష్ట్రంలో డిగ్రీలు అందించిన ఘనత కలిగిన ఈ కళాశాలలో ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 5వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. 50 మంది అధ్యాపకులు, మరో 100 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు.
ప్రస్తుతం మహారాజా కళాశాల అటానమస్ హోదాతో నడుస్తోంది. ఈ కళాశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇంతటి ప్రసిద్ధి పొందిన ఎంఆర్ కళాశాలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని అశోక్ గజపతి రాజు సహా, పూసపాటి వంశీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది కుటుంబ వివాదమే తప్ప ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయమూ లేదని మంత్రి బొత్స చెబుతున్నారు. విద్యార్థులు, అధ్యాపకులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు.
ఇదీచదవండి
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్