కరోనా ప్రభావంతో చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంతో కొంతో కాస్త గొప్పగా బతికినా నేడు ఆ విలాసవంతానికి కొంచెం దూరమవుతున్నారు. కొన్నింటికి కోత వేసేస్తున్నారు. మధ్యతరగతి వారైతే చిన్నచిన్న సంతోషాలనూ పక్కన పెట్టేస్తున్నారు. ఇంట్లో అధిక భాగం ఖర్చు నిత్యావసర సరకులదే. ఈ విషయంలో కనీసం రూ.1000 అయినా ఆదా చేసుకునే అవకాశం ఉంది.
బియ్యంతో పాటు, పప్పులు, కిరాణా సరకులను విడిగా కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది. కూరగాయలను ఇంట్లోనే పండించుకుంటే ఉత్తమం. పండ్ల విషయంలో జామ, అరటి, నారింజ వంటివి తీసుకుంటే తక్కువ ధరే కాకుండా పోషకాలూ మెండుగా ఉంటాయి. బయట తినడం, ఎక్కువగా తిరగడం, ఉపయోగం లేని ప్రయాణాలు మానుకోవాలి. ఇంట్లోనే వండుకోవడం, ప్రతి వస్తువునూ పొదుపుగా వాడడం, తక్కువలో దొరికే వాటిని కొనుగోలు చేయడం తదితర వాటితో ఈ ప్రస్తుత కాలంలో సరైన మార్గంలో ముందుకు వెళ్లవచ్చు.
అనవసర ప్రయాణాలు ఆపేశాం
గతంలో ప్రతి ఆదివారం కారులో కుటుంబంతో విశాఖ, విజయనగరం వెళ్తుండేవాడిని. అయిదు నెలలుగా ఎలాంటి ప్రయాణాలు లేవు. దీంతో నెలకు రూ.6000 వరకు ఆదా అవుతోంది. ఇప్పుడు ఖాళీ సమయం దొరకడంతో ఇంటివద్ద రకరకాల కూరగాయలు పండిస్తున్నాం. వారానికి రూ.300 వరకు ఖర్చు తగ్గింది. ద్విచక్రవాహనం బదులు సైకిల్ వినియోగిస్తున్నా.
- వై.మోజేష్, ఉపాధ్యాయుడు, బొబ్బిలి
ఆర్భాటాలకు దూరం
పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నా. నెలకు రూ.12000 వచ్చేది. కుటుంబ ఖర్చులకు సరిపోయేది. కరోనాతో పాఠశాల మూతపడింది. ఆరు నెలలుగా జీతం లేదు. గతంలో దాచుకున్న డబ్బులు మూడు నెలలు సరిపోయాయి. బంగారం కుదువపెట్టగా వచ్చిన డబ్బులతో ప్రస్తుతం రోజులు నెట్టుకొస్తున్నాం. ప్రస్తుతం నెల ఖర్చంతా కలిపి రూ.6000 లోపే ఉండేలా చూసుకుంటున్నా. పిల్లల పుట్టినరోజుకి గతంలో మూడు వేలు వరకు ఖర్చయ్యేది. ప్రస్తుత పరిస్థితిలో వాటికి దూరంగా ఉంటున్నాం. గతంలో చిన్నచిన్న పనులకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవాళ్లం. ప్రస్తుతం సైకిల్ వినియోగించి పెట్రోల్ ఖర్చు తగ్గించుకుంటున్నా. రేషన్ బియ్యాన్నే తింటున్నాం.
- పూడి రామకృష్ణ, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు, సాలూరు
ఖర్చులు తగ్గించుకున్నాం
గతంలో నెలకు రూ.10 వేల వరకు ఆదాయం వచ్చేది. కొవిడ్ ప్రభావంతో వ్యాపారాలు మందగించాయి. రూ.5 వేలు కూడా రాని దుస్థితి. అయినా ఢీలా పడలేదు. వృథా ఖర్చుల జోలికి వెళ్లడం లేదు. గతంలో పాలకి నెలకు వెయ్యి వరకు వెచ్చించగా ప్రస్తుతం రూ.600 ఖర్చుచేస్తున్నాం. విద్యుత్తు వాడకాన్ని తగ్గించాం. గదిలో ఉన్నప్పుడే దీపం ఉండేలా.. అవసరాన్నిబట్టి పంకా తిరిగేలా చేయడంతో గతంలో రూ.600 వచ్చే బిల్లు ప్రస్తుతం రూ.400కి తగ్గింది. ఇలా అప్పులు చేయకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
-తేజేశ్వరరావు, చిరువ్యాపారి, పార్వతీపురం
ఇంటి ముంగిటే కూరగాయల సాగు
బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు తన ఇంటి ముందే కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో పెరటి సాగు చేపట్టారు. ‘ఆనప, బీర, బెండ, వంగ తదితర కూరగాయలు పండిస్తున్నాం. వాటి వల్ల వారానికి రూ.500 వరకు ఖర్చు తగ్గుతోందని ఆయన అంటున్నారు.
ఇదీ చదవండి: