Lack of Facilities in Libraries: విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను..వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. గ్రంథాలయాలకు నిధులు విదిల్చేందుకు కూడా ససేమిరా అంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వేయి 26 గ్రంథాలయాలు ఉంటే కొన్నేళ్లుగా వీటి అభివృద్ధి, మౌలిక సదుపాయల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 615 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 120 గ్రంథాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మరో 291 దాతలు ఉచితంగా ఇచ్చిన భవనాల్లో నిర్వహిస్తున్నారు.
కొత్తగా గ్రంథాలయ భవన నిర్మాణాలు దేవుడెరుగు ఉన్న వాటికి మరమ్మతులు కూడా చేయడం లేదు. సిబ్బంది జీతాలతో సహా అభివృద్ధి పనులకు.. స్థానిక సంస్థలు వసూలు చేసే పన్ను ఆదాయమే వాడుకోవాలని ఆదేశాలు ఇస్తోంది. పాఠకుల అభిరుచికి అనుగుణంగా పుస్తకాల కొనుగోలు.. వారికి సౌకర్యాలు కల్పించేందుకు నిధులు లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు సన్నద్ధమవుతున్న అభ్యర్ధులకు.. అవసరమైన పుస్తకాలు గ్రంథాలయాల్లో లభించడం లేదు. కొన్నిచోట్ల పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి.
పుస్తకాలు కావాలని అభ్యర్థులు విన్నవించినా నిధుల కొరత వల్ల సకాలంలో కొనుగోలు చేయడం లేదు. కొన్నిచోట్ల నేలపై కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పోటీ పరీక్షల సమయంలో విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయం, రాజమహేంద్రవరంలోని గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయాలకు.. ఇతర జిల్లాల నుంచి అభ్యర్థులు వస్తుంటారు. కానీ అక్కడ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విజయనగరంతో పాటు.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థులు వస్తుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇదే ప్రధాన గ్రంథాలయం. ఇంతటి ప్రాముఖ్యమున్న ఈ గ్రంథాలయం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రంథాలయంలో రీడింగ్ గదులు రెండే ఉండడంతో అందరికీ సరిపోవడం లేదు. చేసేది లేక పాఠకులు భవనం పైనున్న గది, కింద ఉన్నపార్కు ప్రాంతంలో నేలపై కూర్చొని చదువుకుంటున్నారు.
అనకాపల్లిలోని గ్రంథాలయాన్ని ఆద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడి అభ్యర్థులు వస్తుంటారు. అద్దె భవనంలో సదుపాయం సక్రమంగా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కేంద్ర గ్రంథాలయ భవనం శ్లాబు పైభాగం పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. పెద్ద సంఖ్యలో పాఠకులు ఇక్కడి వస్తుంటారు. పై అంతస్తులో 50 మంది చదువుకునేందుకే వీలుంది. మిగతా వారు పత్రికా పఠన విభాగంలో కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది. ఏలూరు కొత్త పేటలోని మహిళా గ్రంథాలయాన్ని నగరపాలక సంస్థకు చెందిన చిన్న భవనంలో నిర్వహిస్తున్నారు. ఇందులో పుస్తకాలు పెట్టుకోవడానికే సరిపోతుంది. పాఠకులు కూర్చొవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్న స్థానిక సంస్థలు ఆ మొత్తాన్ని గ్రంథాలయాలకు సక్రమంగా ఇవ్వడం లేదు. నెల్లూరు, శ్రీకాకుళంలో మూడు నెలలపాటు జీతాలు నిలిచిపోతే పన్నుల డబ్బులు వచ్చిన తర్వాత చెల్లించారు. జీతాలు, పెన్షన్లు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం 100కోట్ల రూపాయలు ఇవ్వాలని 2021-22లో గ్రంథాలయ శాఖ ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం కేవలం 43 కోట్ల 49 లక్షలు రూపాయలు మాత్రమే ఇచ్చింది.
2022-23లో 361 కోట్ల 83 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పెడితే 40 కోట్ల రూపాయలే ఇచ్చింది. రాష్ట్ర జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ల జీతభత్యాలు పన్ను నిధుల నుంచే చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లకు గౌరవేతనం 2వేల 500 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దీన్ని ఏకంగా 30వేల రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది అమల్లోకి వస్తే పన్ను ఆదాయం గౌరవవేతనాలు, జీతభత్యాలకు ఖర్చవుతుంది.
స్థానిక సంస్థలు ప్రజల నుంచి గ్రంథాలయ పన్నును ముక్కుపిండి వసూలు చేస్తున్నా వాటిని గ్రంథాలయ సంస్థకు జమ చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి 762 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 373కోట్ల 44 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. మిగతా నిధుల కోసం స్థానిక సంస్థల్ని గ్రంథాలయాలు కోరుతున్నా ఇవ్వడం లేదు.
విజయవాడ నగరపాలక సంస్థ నుంచి 81కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 136కోట్ల, గుంటూరు జిల్లాలో 43కోట్లు, ప్రకాశంలో 16కోట్లు, కర్నూలులో 25 కోట్లు రూపాయల బకాయిలు ఉన్నాయి. నిధుల్లేక గ్రంథాలయశాఖ మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోంది. వసతుల లేమి కారణంగా.. పాఠకులు గ్రంథాలయాలకు రావడం క్రమంగా తగ్గిపోతోంది.