Schools Issues: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉంది. నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో అధునాతన వసతులు, నాణ్యమైన భోజనం, విశాలమైన ఆట స్థలాలు నిర్మించామని ప్రభుత్వం చెబుతుండగా... విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో మాత్రం పాఠశాలలు ఏ నిమిషంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెచ్చులూడిపోతున్న భవనాల్లో పాఠాలు చెప్పేందుకు భయపడిపోతున్న ఉపాధ్యాయులు.. సమీపంలోని అద్దె ఇళ్లల్లో అరకొర సౌకర్యాలతోనే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు మాత్రం శిథిల భవనాల్లోనే కొనసాగిస్తున్నారు.
కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల భవనం కూలిపోయేలా ఉండటంతో గతేడాది అక్టోబర్ 20న మూసివేశారు. సమీపంలోని ఓ పెంకుటింట్లో పాఠశాల నిర్వహిస్తున్నారు. పిన్నింటిపాలెం ప్రభుత్వ పాఠశాలలో 19 మంది విద్యార్థులు ఉండగా ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో.. రేకుల షెడ్డులోకి మార్చారు. పాతచెరుకుపల్లిలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో.. గ్రామ సర్పంచ్ బంధువులకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోకి మార్చారు. జాతీయ రహదారి విస్తరణలో నారుపేట ప్రాథమిక పాఠశాల భవనం తొలగించడంతో.. ఈ పాఠశాలను రేకుల షెడ్డులో నడుపుతున్నారు.
భోగాపురం మండలంలో కొత్తూరు, పిన్నింటిపాలెం, పాతచెరుకుపల్లి, చెరువుకొమ్ము గొల్లపేట, ఎరుసుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి ప్రమాదకరమని నివేదిక ఇచ్చారు. ఎరుసుపేట, చెరువుకొమ్ము గొల్లపేట పాఠశాలలు మాత్రం శిథిల భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. ఇలాంటి బడులకు తమ పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: