విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన తనను చంపేందుకు తెదేపా నేతలు యత్నించారని వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న సాయంత్రం 5 గంటలకు ఆయన ఫిర్యాదు చేసినట్లు నెల్లిమర్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ‘రామతీర్థంలో విగ్రహం ధ్వంసమైందని తెలియడంతో పార్టీ నాయకులతో అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్నాను. ఈ క్రమంలో తెదేపా నేత కళా వెంకటరావు, కొంతమంది ఆ పార్టీ సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా నాపై దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన నా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. కారును ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడి దిశానిర్దేశంతో కళా వెంకటరావు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు 307, 326, 427, 503, 506, 323, 120b r/w 34ipc, 3pdppa సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని నెల్లిమర్ల ఎస్సై దామోదరరావు సోమవారం తెలిపారు.
ఈ విషయమై నెల్లిమర్ల ఎస్సై దామోదర్రావును 'ఈటీవీ భారత్' సంప్రదించగా... ఎంపీ ఫిర్యాదు మేరకు కొంతమందిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే అది ఎవరన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించారు. ఘటనలో ఉన్న వారిని గుర్తు పట్టేందుకు వీడియోలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు వైకాపాకు, విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టారని కొందరిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి
రామతీర్థం ఘటనలో 20 మందిని అదుపులోకి తీసుకున్నాం: విజయనగరం ఎస్పీ