కరోనా మహమ్మారి విజయనగరం జిల్లాలో తాండవం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 1073కి చేరింది. ఒక్క రోజే 87 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని ప్రధాన పట్టణాలైన విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో నేటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి మూత పడ్డాయి.
నిత్యం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ప్రకటిత ప్రాంతాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మార్గదర్శకాలు జారీ చేశారు. విజయనగరం వాణిజ్య మండలి ఆధ్వర్యంలో విజయనగరంలో ఈ నెల 16నుంచి 21వ తేది వరకు మొదటి విడతగా స్వచ్ఛందంగా పూర్తి లాక్ డౌన్ పాటిస్తున్నారు. శ్రావణమాసం సందర్భంగా 22 నుంచి 31వ వరకు దుకాణాలు తెరుచుకోనున్నాయి. తరువాత ఆగస్టు ఒకటి నుంచి పదో తేది వరకు రెండో విడత లాక్ డౌన్ అమలు చేయనున్నారు.
అయితే.. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నేటి నుంచి లాక్ డౌన్ అమలవుతున్నా... మద్యం దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు కొనసాగడం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చదవండి:
సింహాచలం గోశాలలో పాతవారినే నియమించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశం