Botsa Satyanarayana: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నాబార్డ్ మంజూరు చేసిన రెండు కోట్ల నిధులతో నిర్మించిన 20 తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని రామభద్రపురం ఉన్నత పాఠశాల ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. విద్యార్థులకు అనుకూలంగా ఉపాధ్యాయుల సంఖ్య పెంచామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జూనియర్ కళాశాలను కూడా మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ.. తాను భూమి పూజ చేసిన తరగతి గదులు అనతి కాలంలోనే పనులు పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. మంత్రి బొత్స పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాగులు, మధ్యాహ్న భోజన పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన బ్యాగులు బాగోలేవని విద్యార్థులు మంత్రికి వివరించారు. వెంటనే కొత్త బ్యాగులు అందిస్తామని విద్యార్థులకు భరోసానిచ్చారు.
ఇవీ చదవండి: