విద్యార్థుల నుంచే రాజకీయ నాయకులు రావాలని, కళాశాలల్లో విద్యార్థి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆన్నారు. విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 23వ రాష్ట్ర మహాసభల్లో(SFI Meeting in vizianagaram) ఆయన పాల్గొన్నారు. తనతోపాటు చాలామంది విద్యార్థి సంఘ నాయకులుగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల సమావేశాల్లో పాల్గొవడం ద్వారా విద్యార్థులు సమస్యలు తెలుస్తాయని, తద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.
నూతన విద్యా విధానం ద్వారా కొన్ని మార్పులు చేస్తున్నామన్న మంత్రి... సాధ్యాసాధ్యాలను ఆలోచించాలని ఎస్ఎఫ్ఐ నాయకులకు సూచించారు. నేటి సమాజంలో ఆంగ్ల విద్య ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. తెలుగు భాషను విస్మరించకుండా కేవలం ఉపాధి అవకాశాల కోసం మాత్రమే ఇంగ్లీష్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఎవరినీ బలవంతం చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు నాడు-నేడు కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
కళాశాలల్లో మళ్లీ విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలి. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి. విద్యార్థి ఎన్నికలపై సీఎం జగన్‌తో చర్చిస్తాను.
- మంత్రి బొత్స సత్యనారాయణ
ఇదీచదవండి.