Minister Botsa on Ashok Gajapathi Raju: రామతీర్థం శ్రీకోందడ రామాలయ పునఃనిర్మాణ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు వ్వవహరించిన తీరు సరైంది కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆలయ సంప్రదాయాలు, ట్రస్టీ నిబంధనలు పాటించలేదని అశోక్ చెప్పటం వాస్తవ విరుద్ధమన్నారు. ప్రొటోకాల్ ప్రకారమే అధికారులు వ్యవహరించారని వెల్లడించారు. ఆహ్వాన పత్రికలోనూ, శిలాఫలకంలోనూ ఆయన పేరును మద్రించినట్లు తెలిపారు. కార్యక్రమానికి పిలిచేందుకు వెళ్లిన ఆలయ ఈవో, అర్చకులపై అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. పుజాది కార్యక్రమాల్లోనూ ఎక్కడా లోటుపాట్లు లేవని..,సంప్రదాయాలు పాటించలేదని అశోక్ గజపతి రాజు ఆరోపించటం అవాస్తవమని మంత్రి అన్నారు.
రామతీర్థం ఆలయ శంకుస్థాపనకు పద్ధతి ప్రకారం అందరినీ పిలిచాం. పిలిచేందుకు వెళ్లిన ఈవో, అర్చకులపై అశోక్ గజపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమిపూజకు ముందు శిలాఫలకాన్ని తీసేందుకు యత్నించారు. ప్రభుత్వం శిలాఫలకం వేయొద్దని అశోక్ గజపతి చెప్పటం సరి కాదు. - బొత్స సత్యనారాయణ మంత్రి
వివాదం ఏంటంటే..?
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మానికి బుధవారం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందూ చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
హిందూ ధర్మాన్ని కాపాడాలి..
దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని... ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి.. ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారు అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.
ఆలయ నిర్మాణం ఆయనకు ఇష్టం లేదు..
అశోక్ గజపతిరాజుకు ఆలయ ధర్మకర్తగా గౌరవం ఇచ్చామని, ఈవో, ప్రధాన అర్చకులు వెళ్లి ఆహ్వానించారని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకం చేయించామని, ఆలయాన్ని పునర్నిర్మించడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. కార్యక్రమానికి గంట ముందే వెళ్లి వీరంగం సృష్టించారన్నారు. ఆలయాభివృద్ధికి ఆయన ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని తెలిపారు. రామాలయం సాక్షిగా అశోక్ నిజస్వరూపం బయటపడిందని మరో మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు..
అశోక్ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రామతీర్థం ఘటనపై 2 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారని కేసులు పెట్టారు. రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి
Ashok Fires On Govt: రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత.. రామాలయ శంకుస్థాపనలో తోపులాట