కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో గతనెల 21 నుంచి విజయనగరం జిల్లా సాలూరులో సుమారు రెండు వేల లారీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రవాణా బంద్ కావటంతో పరిశ్రమలపై ఆధారపడిన లారీ యజమానులు, కార్మికులు 20వేల మంది వరకు బతుకు భారమైందని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ పన్నులు, బీమా వంటి భారం మాత్రం తప్పటం లేదని లారీ యజమానులు చెబుతున్నారు. పట్టణంలోని లారీ పరిశ్రమ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉంది. లారీలు నిలిచిపోయినందున డ్రైవర్లు, క్లీనర్లతో పాటు అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవించే సుమారు 20వేలమంది ఉపాధి పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు.
మరీ దీనంగా అనుబంధ రంగాలు..
లారీలు నిలిచిపోవటంతో అనుబంధ పరిశ్రమల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మెకానికల్ షెడ్లు, టైర్లు, బాడీ బిల్డిండ్, పెయింటింగ్, వెల్డింగ్, స్టిక్కరింగ్, కట్టలు, ఎలక్ట్రీషియన్, బ్యాటరీలు, రీట్రేడింగ్ వంటి 14 అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు సుమారు 15వేల మంది ఉన్నారు. రథచక్రాలు ఆగిపోయి, షెడ్లు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌లో పాల్గొని వారంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేక కార్మిక కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి.
రైతుల పంటలు పాడవకూడదని..
రైతులు పండించిన పంటలు, నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో జనతా కర్ఫ్యూ ముందురోజున లోడింగ్ అయి రోడ్లపై నిలిచిపోయిన లారీల నుంచి సరకు దించుకునేలా ఆదేశాలు వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా అనుమతి ఇవ్వడంతో కాస్త ఉపశమనం కలిగింది. పత్తి, మొక్కజొన్న విత్తన పంటను పరిశ్రమలకు చేరవేసేందుకు లారీలను లోడింగ్ పెడుతున్నట్లు లారీ యజమానులు నిర్ణయించారు. కొన్ని లారీలైనా రోడ్డెక్కితే ఆటు కార్మికులకు, ఇటు రైతులకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆధారపడిన వారి సంఖ్య
ప్రత్యక్షంగా | 10,000 |
పరోక్షంగా | 15,000 |
మొత్తం లారీలు | 2,000 |
అనుబంధ పరిశ్రమలు | 14 |
యజమానులు | 1700 |
ఇవీ చదవండి: