ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు విధించిన లాక్ డౌన్ అమలు, కరోనా నియంత్రణపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో టాస్క్ పోర్స్ ఏర్పాటైంది. కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. తొలుత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి... కరోనా కట్టడి, లాక్ డౌన్ అమలుపై టాస్క్ ఫోర్స్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
విదేశాల నుంచి జిల్లాకు చేరుకున్న వారి కదలికలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అధికారులతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులు... తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. విదేశాలనుండి వచ్చిన 108 మందిని వైద్యుల పర్యవేక్షణలో వారి ఇళ్లల్లో నిర్బంధించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కరోనా నియంత్రణ, వైద్య సేవలకు సంబంధించి 200 పడకల ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ నెలాఖరు వరకు ఆటోలు, ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ శ్రీదేవి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా... అత్యవసర పరిస్థితుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.