Bhogapuram Airport Lands: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుంచి జిరాయితీ, డి పట్టా భూములు 2,200 ఎకరాలు సేకరించింది. ప్రాంతాన్ని బట్టి జిరాయితీ భూమికి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఇచ్చింది. డి.పట్టా భూములకు ముందుగా ఎకరాకు రూ.12.50 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా.. కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వారికి కూడా జిరాయితీ భూముల మాదిరిగానే చెల్లించారు. ప్రభుత్వ భూమి పదేళ్ల పాటు అనుభవంలో ఉంటే జీవో నంబరు 517 ప్రకారం పరిహారం కోరవచ్చని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇదే అదనుగా కొంతమంది అక్రమాలకు తెరలేపారు. భోగాపురం మండలంలోని కంచేరు, కంచేరుపాలెంలో సర్వే నంబరు 231లో 100.18 ఎకరాలు (గయాలు) ఉంది. అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడు ఒకరు ఆ భూములు కొన్నేళ్లుగా తమ సాగులోనే ఉన్నాయని వారి కుటుంబసభ్యుల పేరుతో పరిహారం కాజేయడానికి దస్త్రాలు సిద్ధం చేసి, అధికారులకు సమర్పించినట్లు సమాచారం. సదరు నాయకుడు కేవలం తన బంధువుల పేర్లు ఉంటే అనుమానం వస్తుందని, స్థానికులు, తనకు పరిచయస్తులైన సుమారు 60 మంది పేర్లను జత చేశారని.. పరిహారం జమయ్యాక ఆ మొత్తం తిరిగి తనకు ఇచ్చేయాలని, ఇందుకు కొంత ఇస్తానని ముందే ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో కొంతమంది రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విభేదాలతోనే గుట్టురట్టు..
అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలతో ఈ విషయం బయటకు పొక్కింది. ఇందులో ఓ వర్గం ఓ కీలక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లగా.. ఇప్పటి వరకు విషయం తెలియని ఆయన కూడా ఈ వ్యవహారంలో తలదూర్చారు. కంచేరులో ఉన్న 100.08 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 60 ఎకరాలకు సంబంధించి రైతుల స్వాధీనంలో ఉన్నట్లు దస్త్రాలు సృష్టించినట్లు సమాచారం. ఇందులో పార్టీ ఉత్తరాంధ్ర స్థాయి నాయకుడి ప్రమేయం ఉందని, ఆయన సహకారంతోనే అమరావతి స్థాయిలో చక్రం తిప్పుతున్నారని భోగట్టా. దీన్ని జీర్ణించుకోలేని మరో వర్గం ప్రతిపక్ష నాయకులకు సమాచారం ఇవ్వడంతో విషయం రచ్చకెక్కింది. దీనిపై విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఇటీవల స్పందనలో కలెక్టర్ సూర్యకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో వైకాపాలో వర్గవిభేదాలు బయటపడటంతో స్థానిక ప్రజాప్రతినిధిపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
అధికారుల్లో దడ..
రెవెన్యూ అధికారుల సలహాలు, సూచనలతోనే ఈ తతంగం నడిపించారు. వారికి అనుకూలంగా ఉన్న కొంతమందిని తహసీల్దారు కార్యాలయానికి బదిలీపై రప్పించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరికి కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు అధికారుల్లోనూ దడ మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇదీ చదవండి: జిల్లాల విభజన సహేతుకంగా లేదు : వైకాపా ఎమ్మెల్యే ఆనం