ఛత్తీస్‌గఢ్‌లోని మావోల మెరుపు దాడిలో విజయనగరం జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ వీరమరణం పొందారు. నగరంలోని గాజుల రేగకు చెందిన రౌతు జగదీష్గా అధికారులు గుర్తించారు. జగదీష్ మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఉన్నత అధికారిని, మరో ముగ్గురు జవాన్లను కాపాడటానికి వెళ్లి.. జగదీష్ వీరమరణం పొందినట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలియజేశారు.
జవాన్ రౌతు జగదీష్‌కు వచ్చే మే 22 వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో ఒక్కగానొక్క కుమారుడు ఇలా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. గాజులరేగలో బ్లాక్‌డే నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు .. ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. జగదీష్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆయన పార్దీవదేహం సాయంత్రానికి గాజులరేగ చేరుకుంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి...: బీజాపూర్ ఘటన: రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతి