Fire accident in Vizianagaram : గుర్ల మండలంలో దేవునికణపాక పంచాయతీ గవిపేటలో బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. గుర్ల ఎస్సై హరిబాబునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బాణసంచా సామగ్రి తయారీ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఉవ్వెత్తున మంటలు ఎగసి పడ్డాయి. వెంటనే స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు, చీపురుపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అక్కడున్న రాత్రి కాపలాదారు సీతంనాయుడు సజీవదహనం కాగా, గవిడి సూరమ్మ అనే మహిళ గాయాలపాలైంది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమా?లేక మరే కారణంతో అయినా ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కడపలో రైలుకింద పడి ముగ్గురు మృతి.. కడప రైల్వే స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైలు కిందపడి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందగా.. మరొకరు ప్రమాదవశాత్తూ ట్రైన్ కిందపడి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో అల్లూరి సీతారామరాజు నగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్కావటంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కృష్ణాపురం మార్గమధ్యంలోని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.
పట్టాలు దాటుతుండగా... మరోవ్యక్తి మస్తాన్ ఊటుకూరు రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నూరు మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఇంకోవ్యక్తి శివశంకర్ అనే యువకుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేక జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ రారాజు తెలిపారు. కాగా.. ఇటీవల పది రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అదే రోజు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చీరాలలో... మరోవైపు బాపట్ల జిల్లా చీరాలలో మెయిన్ విద్యుత్ తీగ తెగి పడిన సంఘటన చోటుచేసుకుంది. మెయిన్ రోడ్డులో 11 కిలోవాట్ల విద్యుత్ తీగ తెగిపడి మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటను అర్పివేయగా.. విద్యుత్ సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు.
ఇవీ చదవండి: