JNTU Gurajada Vijayanagaram University : విజయనగరంలో 2007లో ఏర్పాటైన జేఎన్టీయూ ప్రాంగణం.. కాకినాడ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలగా కొనసాగుతోంది. 2019లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ ప్రాంగణాలను కలిపి గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2021 జూన్ 30న విజయనగరం జేఎన్టీయూ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తున్నట్లు మంత్రి మండలిలో ప్రకటించి.. ఈ నెల 12న విశ్వవిద్యాలయంగా గెజిట్ జారీ చేశారు.
పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మారడంతో ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దాదాపు 40ఇంజనీరింగ్ కళాశాలలు.. గురజాడ విజయనగరం యూనివర్సిటీ పరిధిలోకి రానున్నాయి. అంతేకాకుండా కొత్త కోర్సులు, పరిశోధనల ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధ్యాపకులు చెబుతున్నారు. ఈ యూనివర్సిటీ ఉత్తరాంధ్ర విద్యార్ధులకు వరం కానుందని అంటున్నారు.
ప్రస్తుతం 80ఎకరాల సువిశాల ప్రాంగణంలో 13 కోర్సులతో జేఎన్టీయూ కొనసాగుతోంది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్సుల్లో కలిపి ప్రస్తుతం ఇక్కడ 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీగా స్థాయి పెంచటంతో మరిన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయి ఫ్యాకల్టీ అందుబాటులోకి వస్తారని... ఇది విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అధ్యాపకులు అంటున్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే పలు అభివృద్ధి నిర్మాణాలకు పనులు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి : CM JAGAN : 'డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ సాధ్యమవుతుంది'