విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొద్ది రోజులుగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ..విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదు కాలేదని...అందుకు జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది కృషే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. లాక్ డౌన్ కారణంగా రోజువారి కూలీలు, పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్... ఉచిత రేషన్ అందించడంతోపాటు తెలుపు కార్డుదారులకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించి సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి...సీఎం సహాయ నిధికి భారతి సిమెంట్స్ విరాళం రూ.5 కోట్లు