Water problems: తాగునీటి సమస్య విజయనగరం ప్రజలను వేధిస్తోంది. రెండు, మూడు రోజులకోసారైనా నీళ్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీరు ఎప్పుడొస్తుందో తెలియక కుళాయిల వద్ద బిందెలతో ఎదురుచూస్తున్నారు. నగరంలో 50డివిజన్లు ఉండగా సగానికి పైగా తాటిపూడి జలాశయం వద్ద ఏర్పాటైన ముషిడిపల్లి తాగునీటి పథకం నుంచి నీరు అందుతోంది. మిగిలిన డివిజన్లకు నెల్లిమర్లలోని చంపావతి నుంచి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఆయా జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.
గంటసేపు మాత్రమే నీరు వస్తుండగా మూడు, నాలుగు బిందెల కంటే ఎక్కువ రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల్లో బురద నీరు వచ్చినప్పటికీ వేరే దారిలేక వాటినే ఉపయోగించాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 3600 ఇంటింటి కొళాయిలు ఉన్నాయి. కొళాయిలు మంజూరు చేసిన ప్రభుత్వం... నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచటంలో అశ్రద్ధ వహిస్తోందని మహిళలు చెబుతున్నారు.
విజయనగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని పురపాలక కమిషనర్ శ్రీరాములు నాయుడు తెలిపారు. దీనికోసం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
రెండు నెలలుగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: